డెల్టా ప్లస్‌ డేంజర్‌ కాదు

27 Jun, 2021 11:45 IST|Sakshi

స్పష్టం చేసిన ఐఎల్‌ఎస్‌ డైరెక్టర్‌ 

భువనేశ్వర్‌: డెల్టా ప్లస్‌ వేరియంట్‌ అత్యంత హానికరం కాదని స్థానిక ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సెస్‌ (ఐఎల్‌ఎస్‌) డైరెక్టర్‌ డాక్టర్‌ అజయ్‌ ఫరిడ శనివారం తెలిపారు. దేవ్‌గడ్‌ జిల్లాలో తొలి డెల్టా ప్లస్‌ కేసు శుక్రవారం నమోదైంది. జెనోమ్‌ సీక్వెన్సింగ్‌ విధానంలో దీన్ని పరీక్షించారు. హానికరమైన వేరియంట్‌ అయితే జిల్లాలో భారీగా విస్తరించేదని ఆయన అభిప్రాయపడ్డారు. నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా మసలుకోవడం అనివార్యమని హితవు పలికారు.  ఈ ఏడాది జనవరి నుంచి 46 వేల కోవిడ్‌–19 పాజిటివ్‌ నమూనాల్ని ఐఎల్‌ఎస్‌ పరీక్షించిందని వాటిలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన 1,100 నమూనాలు ఉన్నట్లు వివరించారు. రాష్ట్రంలో నమోదైన తొలి డెల్టా ప్లస్‌ బాధితుడు ఈ ఏడాది ఏప్రిల్‌లో కోవిడ్‌–19 బారిన పడ్డాడు. జెనోమ్‌ సీక్వెన్సింగ్‌ పరీక్ష కోసం ఈ నమూనా ఏప్రిల్‌లో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సెస్‌కు సిఫారసు చేశారు. మే నెల మొదటి వారంలో నిర్వహించిన పరీక్షల్లో డెల్టా ప్లస్‌ నమోదైంది. ఆ వ్యక్తి ఆరోగ్యంతో కోలుకున్నాడు. ఏప్రిల్‌ నుంచి నిర్వహిస్తున్న జెనోమ్‌ సీక్వెన్సింగ్‌ పరీక్షల్లో ఇంత వరకు తదుపరి డెల్టా ప్లస్‌ పాజిటివ్‌  కేసులు నమోదు కానట్లు డాక్టర్‌ అజయ్‌ ఫరిడ వివరించారు.

నిబంధనలు నిత్యం పాటించాలి
ఒడిశాతో పాటు బీహార్, ఛత్తీస్‌గఢ్, ఝార్కండ్‌ రాష్ట్రాల నుంచి 3 వేల 800 నమూనాల్ని జెనోమ్‌ సీక్వెన్సింగ్‌ పరీక్ష కోసం ఐఎల్‌ఎస్‌ కేంద్రానికి సిఫారసు చేశారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన 46 వేల నమూనా పరీక్షల్లో 48 డెల్టా ప్లస్‌ కేసులు వెలుగుచూశాయి. ఇది నామమాత్రంగా 0.01 శాతం మాత్రమే. భవిష్యత్తులో దీని ప్రభావంపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. అప్రమత్తంగా వ్యవహరించి జాగ్రత్త పడాల్సి ఉందని సూచించారు. అన్‌లాక్‌ తర్వాత కూడా ప్రజలు కోవిడ్‌–19 నిబంధనల్ని నిత్య ఆచారంగా పాటించడం వైరస్‌ సంక్రమణ నివారణకు దోహదపడుతుందని   పేర్కొన్నారు. కోవిడ్‌ టీకాలు 2 మోతాదులు పూర్తవుతున్న తరుణంలో తదనంతర పరిణామాల్ని వైజ్ఞానికులు పరిశీలిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ తొలి సమావేశం ఇటీవల పూర్తయింది. వచ్చే వారం రెండో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో జిల్లా వారీ సమాచారంపై నిపుణులు సమీక్షించి   కోవిడ్‌ టీకాల రెండు మోతాదుల తదనంతర పరిణామాల్ని    విశ్లేషిస్తారని వివరించారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు