డెల్టా ప్లస్ వేరియంట్ కలకలం.. మహారాష్ట్రలో రెండో మరణం

26 Jun, 2021 14:03 IST|Sakshi

ముంబై: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గుతున్న సమయంలో  డెల్టా ప్లస్ వేరియంట్ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇటువంటి ఆందోళనల మధ్య మహారాష్ట్రలో డెల్టా ప్లస్ వేరియంట్ రోండో మరణం నమోదైంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజారవాణా, లోకల్‌ రైళ్లపై కొనసాగుతున్న ఆంక్షలు పొడిగించాలని భావిస్తున్నట్లు సమాచారం. కోవిడ్‌ నిబంధనలు మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది. థర్డ్‌వేవ్‌ ఆందోళనల నేపథ్యంలో వ్యాక్సినేషన్‌పై మరింత దృష్టి సారించి, సాధ్యమైనంత ఎక్కువ మందికి టీకా వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది. అదే విధంగా కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచుతామని తెలిపిన సంగతి తెలిసిందే.

ఇక డెల్టా ప్లస్‌ వేరియంట్‌ నమోదైన తమిళనాడు, రాజస్థాన్‌, కర్ణాటక, పంజాబ్‌, ఆంధ్రప్రదేశ్‌, జమ్మూకశ్మీర్, గుజరాత్‌, హర్యానా రాష్ట్రాలు తీసుకోవాల్సిన చర్యలను కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ సూచించారు. దేశంలో ఇప్పటి వరకు 45, 000 పరీక్షలు చేయగా.. 51 కేసులు గుర్తించినట్లు తెలిపారు. దీంట్లో​ అత్యధికంగా 22 డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఇక డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు మహారాష్ట్రలో 22, తమిళనాడులో తొమ్మిది, మధ్యప్రదేశ్‌లో ఏడు, కేరళలో మూడు, పంజాబ్, గుజరాత్‌లలో రెండేసి కేసులు ఉన్నాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్‌సీడీసీ) డైరెక్టర్‌ సుజిత్‌ సింగ్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, రాజస్తాన్, జమ్మూకశ్మీర్, కర్ణాటకలో ఒక్కో కేసు నమోదైందని  విలేకరుల సమావేశంలో ఆయన వివరించారు. ‘డెల్టా ప్లస్‌ మ్యుటేషన్‌ కేసులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. గడిచిన 3 నెలల్లో 12 జిల్లాల్లో దాదాపు 51 కేసులు గుర్తించాం.’’ అని అన్నారు.

చదవండి: టీకాకు భయపడి.. భార్య ఆధార్‌తో రోజంతా చెట్టుపైనే..

మరిన్ని వార్తలు