కిసాన్‌ మహా ‘పంచాయితీ’

11 Jan, 2021 04:24 IST|Sakshi
వేదిక వద్ద రైతుల విధ్వంసం

హరియాణా ముఖ్యమంత్రికి రైతు ఉద్యమ సెగ

కొత్త సాగు చట్టాలపై వివరణ ఇచ్చేందుకు ఖట్టర్‌ ప్రయత్నం

అడ్డుకున్న రైతులు.. వేదిక ధ్వంసం

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కార్యక్రమం రద్దు

చండీగఢ్‌/కర్నాల్‌: బీజేపీ పాలిత రాష్ట్రమైన హరియాణాలోని రైతులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌కు రైతుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. కొత్త సాగు చట్టాల ప్రయోజనాలను వివరించి, రైతన్నలను శాంతింపజేసేందుకు ఆయన చేసిన ప్రయత్నం విఫలమైంది. ముఖ్యమంత్రి నిర్వహించతలపెట్టిన ‘కిసాన్‌ మహాపంచాయత్‌’ను నిరసనకారులు భగ్నం చేశారు. ఇందుకోసం వారు పోలీసుల ఆంక్షలను సైతం లెక్కచేయకుండా కదం తొక్కారు. జల ఫిరంగులకు, బాష్ప వాయువుగోళాలకు ఎదురొడ్డి మరీ అనుకున్నది చేసి చూపించారు.  

హెలిప్యాడ్‌పై బైఠాయింపు
కొత్త వ్యవసాయ చట్టాల వల్ల ఒనగూరే లాభాలను రైతులకు స్వయంగా తెలియజేయడానికి కర్నాల్‌ జిల్లాలోని కైమ్లా గ్రామంలో మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ఆదివారం కిసాన్‌ మహాపంచాయత్‌ నిర్వహిస్తామని కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ జరగనివ్వబోమని, కచ్చితంగా అడ్డుకొని తీరుతామని రైతులు ప్రతిజ్ఞ చేశారు. ముందు నిర్ణయించినట్లుగానే ఆదివారం కైమ్లాలో కిసాన్‌ మహాపంచాయత్‌ వేదికను అధికారులు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకొనేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారతీయ కిసాన్‌ యూనియన్‌(చారుణి) ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో రైతులు కైమ్లాకు బయలుదేరారు.

గ్రామ శివారులో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి, వారిని ముందుకు సాగకుండా ఆంక్షలు విధించారు. కోపోద్రిక్తులైన నిరసనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ రైతులు వినిపించుకోలేదు. ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు వాటర్‌ కేనన్లు, బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. అయినప్పటికీ రైతులు లెక్కచేయలేదు. బారికేడ్లను ఛేదించుకొని కిసాన్‌ మహాపంచాయత్‌ వేదిక వద్దకు పరుగులు తీశారు.

అప్పటికే అక్కడికి కొందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చేరుకున్నారు. రైతులు అక్కడున్న కుర్చీలు, పూల కుండీలు, మైకులను విరగ్గొట్టారు. వేదికను పూర్తిగా ధ్వంసం చేశారు. బీజేపీ హోర్డింగ్‌లు, బ్యానర్లను చించేశారు.  నల్ల జెండాలు పట్టుకుని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై రాళ్లు రువ్వారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్‌ దిగేందుకు ఏర్పాటు చేసిన తాత్కాలిక హెలిప్యాడ్‌పై రైతులు బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చేసేది లేక కిసాన్‌ మహా పంచాయత్‌ కార్యక్రమాన్ని అధికారులు రద్దు చేశారు. మహా పంచాయత్‌ లాంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం తమ గాయాలపై కారం చల్లేందుకు ప్రయత్నిస్తోందని రైతులు తీవ్రంగా మండిపడ్డారు.

ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతాం..
హరియాణాలో రైతులపై వాటర్‌ కేనన్లు, బాష్ప వాయువు ప్రయోగించడంపై కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ సీఎం భూపీందర్‌సింగ్‌ హుడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని తేల్చిచెప్పారు. రైతులను రెచ్చగొట్టవద్దని హెచ్చరించారు. హరియాణా ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని  విమర్శించారు. శాసనసభను వెంటనే సమావేశపర్చాలని, ప్రభుత్వంపై తాము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రకటించారు. సీఎం ఖట్టర్‌ తలపెట్టిన మహా పంచాయత్‌కు ప్రజల మద్దతు లేదని హరియాణా పీసీసీ అధ్యక్షురాలు కుమారి సెల్జా చెప్పారు. మహా పంచాయత్‌ అసలు రంగును రైతులు బయటపెట్టారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్‌ సూర్జేవాలా వ్యాఖ్యానించారు.   

కాంగ్రెస్, కమ్యూనిస్టు నేతలే బాధ్యులు: ఖట్టర్‌
కైమ్లా గ్రామంలో ఉద్రిక్తతకు కాంగ్రెస్, కమ్యూనిస్టు నాయకులే బాధ్యత వహించాలని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ పేర్కొన్నారు. ఆయన ఆదివారం  మీడియాతో మాట్లాడారు. ఇలాంటి అనుచిత ప్రవర్తనను సహించబోమని చెప్పారు. కిసాన్‌ మహా పంచాయత్‌కు అడ్డంకులు సృష్టించబోమని హామీ ఇచ్చిన కొందరు రైతు సంఘాల నేతలు మాట తప్పారని విమర్శించారు. దేశంలో బలమైన ప్రజాస్వామ్యం ఉందన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని అన్నారు. నిజానికి రైతులు అనుచితంగా వ్యవహరించరని చెప్పారు. కొందరు వ్యక్తులు రైతులను అప్రతిష్టపాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మహా పంచాయత్‌లో తాను చెప్పాలనుకున్న విషయాలను తమ పార్టీ నాయకులు ప్రజలకు తెలిపారన్నారు. తాజా ఘటనలో నిఘా వర్గాల వైఫల్యం ఏమీ లేదన్నారు. కైమ్లాలో ఉద్రిక్తతల పరిస్థితుల దృష్ట్యా హెలికాప్టర్‌ను కర్నాల్‌లో దింపాలని తానే సూచించానన్నారు. 

మరిన్ని వార్తలు