Demonetisation: ఇప్పటికీ క్యాషే కింగ్‌!

3 Jan, 2023 05:05 IST|Sakshi

నోట్ల రద్దుతో చెల్లకుండా పోయిన 86 శాతం కరెన్సీ 

ఆరేళ్ల తర్వాత 83 శాతం పెరిగిన నగదు చలామణి

చెల్లింపుల్లో మాత్రం డిజిటల్‌ దెబ్బకు కుదేలైన నగదు వాటా

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు. ఆరేళ్ల క్రితం మోదీ సర్కారు తీసుకున్న సంచలన నిర్ణయం. అప్పటికి దేశవ్యాప్తంగా చలామణిలో ఉన్న కరెన్సీలో 86 శాతం వాటి రూ.1,000, రూ.500 నోట్లదే. కేంద్రం నిర్ణయంతో అవి ఒక్క దెబ్బతో రద్దయ్యాయి. కానీ ఆర్థిక లావాదేవీల్లో ఇప్పటికీ నగదుదే పెద్ద వాటా! పైగా నోట్ల రద్దు నాటితో పోలిస్తే జనం దగ్గరున్న నగదు ఏకంగా రెట్టింపైందని తాజా గణాంకాలు చెబుతుండటం ఆసక్తికరం. నోట్ల రద్దుకు కాస్త ముందు, అంటే 2016 నవంబర్‌ 4న చలామణిలో ఉన్న కరెన్సీ విలువ కేవలం 17.74 లక్షల కోట్ల రూపాయలు.

రద్దు నిర్ణయం తర్వాత అది ఏకంగా రూ.9 లక్షల కోట్లకు పడిపోయింది. కానీ తాజాగా 2022 డిసెంబర్‌ 23 నాటికి ఏకంగా 32.42 లక్షల కోట్ల రూపాయల విలువైన కరెన్సీ చలామణిలో ఉందని రిజర్వు బ్యాంకు గణాంకాలే చెబుతున్నాయి. రద్దయిన నోట్లు మార్చుకోవడానికి అప్పట్లో 52 రోజుల గడువు ఇవ్వడం తెలిసిందే. ఆ గడువు లోపల రూ.15.3 లక్షల కోట్ల విలువైన పెద్ద నోట్లు, అంటే 99.3 శాతం వెనక్కొచ్చాయని ఆర్‌బీఐ పేర్కొంది. అలాంటప్పుడు నోట్ల రద్దుతో సాధించింది ఏమిటన్న ప్రశ్నలు అప్పట్లోనే తలెత్తాయి.

రద్దు అనంతరం కొత్తగా రూ.2,000 నోటు ప్రవేశపెట్టడం తెలిసిందే. రూ.500 నోట్లను సరికొత్త రూపంలో తిరిగి జారీ చేసినా రూ.1,000 నోట్లను మాత్రం పునరుద్ధరించలేదు. ఒకవైపు డిజిటల్‌ చెల్లింపుల్లో భారత్‌ కొన్నేళ్లుగా ప్రపంచంలోనే అగ్ర స్థానంతో దూసుకుపోతున్నా మరోవైపు నగదు చలామణి కూడా అంతకంతకూ పెరుగుతుండటం ఆసక్తికరమే. అయితే నగదు చలామణి క్రమంగా తగ్గుతోందని ఎస్‌బీఐ తాజా సర్వే ఒకటి తేల్చింది.

‘‘మొత్తం చెల్లింపుల్లో నగదు వాటా 2015–16 ఆర్థిక సంవత్సరంలో 88 శాతం కాగా 2021–22 నాటికి అది 20 శాతానికి తగ్గింది. 2026–27 కల్లా కేవలం 11 శాతానికి పరిమితమవుతుంది. అదే సమయంలో 2015–16లో కేవలం 11.26 శాతంగా నమోదైన డిజిటల్‌ చెల్లింపులు 2021–22 నాటికి ఏకంగా 80 శాతానికి ఎగబాకాయి. 2026–27 కల్లా 88 శాతానికి చేరతాయి’’ అని అది పేర్కొంది.

మరిన్ని వార్తలు