ఢిల్లీకి మరో ముప్పు.. అటు కరోనా.. ఇటు

21 Apr, 2021 08:08 IST|Sakshi

మూడేళ్ళ రికార్డును బద్దలుకొట్టిన డెంగ్యూ బాధితుల సంఖ్య

అప్రమత్తం అయిన అధికార యంత్రాంగం

దోమలతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న వైద్యులు

సాక్షి, న్యూఢిల్లీ: ఓవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. మరోవైపు దోమకాటు కారణంగా వచ్చే  డెంగ్యూ వైరల్‌ జ్వరాల కేసులు ఢిల్లీలో పెరగడం ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మూడేళ్ల రికార్డును డెంగ్యూ బద్దలు కొట్టింది. జనవరి 1వ తేదీ నుంచి ఏప్రిల్‌ 17వ తేదీ మధ్య నమోదైన డెంగ్యూ కేసులు 2018 నుండి వస్తున్న కేసులను అధిగమించాయి. అధికారిక గణాంకాల ప్రకారం గత వారంలో, కొత్తగా నలుగురు డెంగ్యూ రోగులతో మొత్తం రోగుల సంఖ్య ఈ ఏడాది 13కి చేరుకుంది. అయితే జనవరి 1 నుంచి ఏప్రిల్‌ 17 మధ్య సమయంలో  2017 సంవత్సరంలో 18 మంది, 2018 సంవత్సరంలో 12 మంది, 2019 లో 8 మంది, 2020 లో 7గురు డెంగ్యూ రోగులను గుర్తించారు. అధికార గణాంకాల ప్రకారం మొత్తం 13 మంది డెంగ్యూ రోగుల్లో నలుగురు సౌత్‌ ఢిల్లీ కార్పోరేషన్‌ పరిధికి చెందిన వారుగా గుర్తించారు.

అదే సమయంలో, ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చిన 22మంది రోగులు డెంగ్యూ చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. అయితే డెంగ్యూ అనేది నిర్దిష్ట చికిత్స లేదా వ్యాక్సిన్‌ లేని వైరల్‌ వ్యాధి కాబట్టి ప్రతీ ఒక్కరు దోమలతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వ్యాధిని కలిగి ఉన్న దోమలు ముఖ్యంగా పట్టణ వాతావరణాలకు అనుకూలంగా ఉంటాయని, వాటి పరిధి సమశీతోష్ణ ప్రాంతాల వైపు ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని పరిశోధకులు సైతం తెలిపారు. 1996 నుంచి ప్రతీ సంవత్సరం జూలై, నవంబర్‌ మధ్య ఢిల్లీ డెంగ్యూ మహమ్మారి బారిన పడుతోంది.

ఈ అంటువ్యాధులను బాగా ఎదుర్కోవటానికి, ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకోవడానికి భౌగోళిక శాస్త్రవేత్తలు, వైరాలజిస్టులు, కీటక శాస్త్రవేత్తలు, ఎపిడెమియాలజిస్టుల బృందం గతంలో ఒక అధ్యయనం చేసింది. ఢిల్లీలో దోమ–లార్వా పెంపకాన్ని నివారించడానికి సుమారు 15వేలకు పైగా ఇళ్లను పురుగుమందులతో పిచికారీ చేశారు. బహిరంగ ఉష్ణోగ్రత తగ్గడంతో, దోమలు సాయంత్రం వేళల్లో ఇళ్ళలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తాయి కాబట్టి సూర్యాస్తమయం అనంతరం తలుపులు / కిటికీలు మూసివేసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  

చదవండి: కరోనా టీకా సంస్థలకు బూస్ట్‌
లాక్‌డౌన్‌ భయం.. విచ్చలవిడిగా షాపింగ్‌ 

మరిన్ని వార్తలు