ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. 20 రైళ్లు ఆలస్యం

23 Dec, 2022 05:43 IST|Sakshi

న్యూఢిల్లీ/శ్రీనగర్‌: ఢిల్లీని గురువారం ఉదయం పొగమంచు కప్పేసింది. మంచు కారణంగా 20 వరకు రైళ్లు 1.30 గంటల నుంచి 4.30 గంటల పాటు ఆలస్యంగా నడిచాయి. ఢిల్లీలోని పాలం, సఫ్దర్‌జంగ్‌ విమానాశ్రయాల్లో 200 మీటర్ల దూరం పైబడి ఉన్న వస్తువులు కనిపించలేదని పేర్కొంది. జమ్మూకశ్మీర్‌లో 40 రోజులపాటు కొనసాగే తీవ్రమైన శీతాకాల సీజన్‌ ‘చిల్లా–ఇ–కలాన్‌’ప్రభావం గురువారం కనిపించింది. లోయలోని చాలా ప్రాంతాల్లో మంచి నీటి పైపులు, దాల్‌ సరస్సు ఉపరితలం గడ్డకట్టుకుపోయాయి.

బుధవారం రాత్రి శ్రీనగర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత –5.5 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఈ సీజన్‌లో ఇదే అత్యల్పమని అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి –4.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. అమర్‌నాథ్‌ యాత్ర బేస్‌ క్యాంపుల్లో ఒకటైన పహల్గాంలో అత్యల్పంగా –6.8 డిగ్రీలు, గుల్మార్గ్‌లో –5.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే రెండు మూడు రోజుల్లో కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో వర్షం లేదా తేలిక పాటి మంచు కురియవచ్చని ఐఎండీ అంచనా వేసింది. డిసెంబర్‌ 21న మొదలైన ఈ చిల్లా–ఇ–కలాన్‌ సీజన్‌  జనవరి 30వ తేదీ వరకు ఉంటుంది. 

మరిన్ని వార్తలు