బెంగళూరులో దారుణం.. వేధింపులు తాళలేక వైద్యురాలు ప్రియాంశి మృతి

3 Feb, 2023 07:19 IST|Sakshi

యశవంతపుర: శ్రద్ధగా చదివి దంత వైద్యురాలైంది. జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని తపిస్తే ఒక ప్రేమోన్మాది చర్యల వల్ల అర్ధాంతరంగా తనువు చాలించాల్సి వచ్చింది. సహచర వైద్యుని వేధింపులను తాళలేక దంత వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన బెంగళూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా ఉత్తరప్రదేశ్‌ లక్నోకు చెందిన దంత వైద్యురాలు ప్రియాంశి త్రిపాఠి (28) మృతురాలిగా గుర్తించారు.  

ప్రేమించలేదని నిందలు  
వివరాల ప్రకారం.. ప్రియాంశి ఓ ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రిలో దంతవైద్యురాలిగా పని చేసేది. అదే ఆస్పత్రిలో పనిచేసే సుమిత్‌ అనే వైద్యుడు ప్రేమ పేరుతో ఆమెను వేధించటం ప్రారంభించాడు. ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో పాటు డబ్బుల కోసం వెంటపడేవాడు. మద్యం, సిగరెట్‌ తాగాలని వేధించాడు. ఆమె అతన్ని పట్టించుకోకపోవడంతో ద్వేషం పెంచుకున్నాడు. ఆమె ప్రవర్తన సరిగా లేదంటూ ఆస్పత్రిలో తప్పుడు ప్రచారం ప్రారంభించాడు. ఆమెను ఎవరూ పెళ్లి చేసుకోరని చెప్పేవాడు.  

తల్లిదండ్రులు హెచ్చరించినా.. 
అతని ఆగడాలను తట్టుకోలేక  ప్రియాంశి తల్లిదండ్రులకు చెప్పి లక్నోకు వాపస్‌ వచ్చేస్తానని  వేడుకొంది. దీంతో, ప్రియాంశి తల్లిదండ్రులు బెంగళూరుకు వచ్చి సుమిత్‌కు బుద్ధిమాటలు చెప్పారు. తరువాత కూడా అతని తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి కొడుకు ప్రవర్తనను వివరించి తమ కూతుర్ని ఇబ్బందులకు గురిచేయవద్దని హెచ్చరించారు. ఇంత జరిగినా సుమిత్‌లో మార్పు రాలేదు. మళ్లీ ఉన్మాదిగా మారి ప్రియాంశిని వేధించటం ప్రారంభించాడు. దీంతో విరక్తి కలిగిన ప్రియాంశి జనవరి 24న ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది. 

ఈ క్రమంలో లక్నో నుంచి తల్లిదండ్రులు అనేకసార్లు ఫోన్‌ చేసినా స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి ఇంటి యజమానికి కాల్‌ చేశారు. వెళ్లి చూడగా ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు బయటపడింది. ప్రియాంశి తండ్రి సుశీల్‌ త్రిపాఠి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సుమిత్‌పై సంజయ్‌నగర పోలీసులు కేసు నమోదు చేశారు. తన కూతురిని శారీరకంగా, మానసికంగా హింసించటంతోనే ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.    

మరిన్ని వార్తలు