ఇంటి నుంచి చదువుకు అనుమతించండి

6 Oct, 2020 08:08 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పాఠశాలల పునఃప్రారంభానికి వీలుగా కేంద్రం ప్రత్యేక మార్గదర్శకాలను జారీచేసింది. కేంద్ర హోం శాఖ సెప్టెంబర్‌ 30న జారీచేసిన అన్‌లాక్‌–5 మార్గదర్శకాలను అనుసరించి కేంద్ర విద్యా శాఖ ఈ మార్గదర్శకాలను జారీచేసింది. దశల వారీగా పాఠశాలల పునఃప్రారంభానికి వీలుగా అక్టోబర్‌ 15 తరువాత రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చని నాటి మార్గదర్శకాల్లో హోం శాఖ స్వేచ్ఛనిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆరోగ్యం, భద్రత అంశాలకు సంబంధించి మొదటి భాగం, భౌతిక దూరం పాటిస్తూ అభ్యాసం, బోధన కొనసాగించే అంశాలపై రెండో భాగంలో విద్యా శాఖ సోమవారం మార్గదర్శకాలు జారీచేసింది.

ఒకటో భాగంలోని మార్గదర్శకాలను స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటూ అమలు చేయాలని కోరింది. బోధనకు సంబంధించిన రెండో భాగం మార్గదర్శకాలు కేవలం సూచనతో కూడినవని, వాటిని అనుసరించవచ్చని లేదా ప్రత్యేక మార్గదర్శకాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తయారుచేసుకోవచ్చని పేర్కొంది. తల్లిదండ్రుల సమ్మతితో విద్యార్థులు తాము ఇంటి నుంచే చదువు కుంటామంటే అందుకు అనుమతించాలని సూచించింది. బడి పునఃప్రారంభమైన తర్వాత 2–3 వారాల వరకు ఎలాంటి అసెస్‌మెంట్‌ చేయకూడదని, ఆన్‌లైన్‌ లెర్నింగ్, ఐసీటీ విధానాలను ప్రోత్సహించే విధానాలను కొనసాగించాలని సూచించింది.

ఆరోగ్యం, భద్రతకు సంబంధించి మార్గదర్శకాలు ఇలా.. 

► పాఠశాలలోని ఫర్నిచర్, పరికరాలు, స్టేషనరీ, స్టోర్‌ రూమ్‌లు, నీటి ట్యాంకులు, వంట గదులు, క్యాంటీన్, మరుగుదొడ్లు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు తదితర అన్ని ప్రాంతాలను పూర్తిగా శుభ్రపరచడమే కాకుండా డిస్‌ఇన్‌ఫెక్ట్‌ చేయాలి. లోపలి ప్రాంతంలోకి గాలి ధారాళంగా వచ్చేలా చూడాలి. 

► పాఠశాలలు టాస్క్‌ టీమ్‌లను ఏర్పాటు చేయాలి. అత్యవసర సహాయం అందించే టీమ్, జనరల్‌ సపోర్ట్‌ టీమ్, రవాణా మద్దతు బృందం, పారిశుద్ధ్య తనిఖీ బృందం వంటి వాటిని ఏర్పరచి వాటికి బాధ్యతలు అప్పగించాలి. 

► రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసే మార్గదర్శకాలను అనుసరించి పాఠశాలలు ప్రామాణిక నియమావళిని రూపొందించుకునేలా ప్రోత్సహించాలి. భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు, తల్లిదండ్రులకు ఎప్పటికప్పడు సమాచారం ఇచ్చే వ్యవస్థ వంటి వాటిని ఈ నియమావళిలో చేర్చాలి.

► విద్యార్థులకు సీట్లు కేటాయించేటప్పుడు భౌతిక దూరం ఉండేలా చూడాలి. వేడుకలు, ఈవెంట్లు జరపరాదు. విద్యార్థులు అందరూ ఒకేసారి చేరేలా, పాఠశాల విడిచేలా టైమ్‌ టేబుల్స్‌ ఉండరాదు. 

► పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఫేస్‌మాస్క్‌ లేదా ఫేస్‌ కవర్‌తో పాఠశాలకు వచ్చేలా చూడాలి. తరగతి గదుల్లో అయినా, మెస్‌లో అయినా, లైబ్రరీలో అయినా మాస్క్‌లు ధరించే ఉండాలి. 

► భౌతిక దూరం పాటించేందుకు వీలుగా మార్కింగ్స్‌ చేయాలి. విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యే ముందు రాష్ట్ర ప్రభుత్వం తల్లిదండ్రుల సమ్మతి తీసుకోవాలి. విద్యార్థులు ఇంటి నుంచే క్లాసులు వింటామని చెబితే అందుకు అనుమతించాలి. 

► కోవిడ్‌ సవాళ్లపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి అవగాహన కల్పించాలి.

► విద్యార్థులందరికీ టెక్ట్స్‌బుక్స్‌ అందేలా చూడడమే కాకుండా, అకడమిక్‌ కాలెండర్‌ మార్పులకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. మరీ ముఖ్యంగా సెలవులు, పరీ క్షలకు సంబంధించి ఈ ప్రణాళిక తప్పనిసరి.  

► ఒక పూర్తిస్థాయి శిక్షణ పొందిన హెల్త్‌ కేర్‌ అటెండెంట్‌ లేదా నర్స్‌ లేదా డాక్టర్, కౌన్సిలర్‌ పాఠశాలకు అందుబాటులో ఉండేలా చూడాలి.  

► పాఠశాలలో విద్యార్థులు సహా అందరి ఆరోగ్య స్థితిగతులపై సమాచారాన్ని సేకరించాలి. అత్యవసర పరిస్థితుల్లో ఆరోగ్య సేవలు పొందేందుకు వీలుగా ప్రభుత్వ యంత్రాం గానికి చెందిన ఫోన్‌నెంబర్లు, కోవిడ్‌ సెంటర్‌ వివరాలు అందుబాటులో ఉంచుకోవాలి.  

► హాజరు, సిక్‌ లీవ్స్‌ విధానంలో అనువైన మార్పులు చేసుకుని విద్యార్థులు, సిబ్బంది అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. 

► కోవిడ్‌–19 సందేహాత్మక కేసులు ఉన్నప్పుడు ప్రభుత్వ ప్రొటోకాల్‌ను అనుసరించాలి. 

► ఇల్లు లేని విద్యార్థులు, వలస కార్మికుల పిల్లలు, దివ్యాంగులు, కోవిడ్‌–19 ప్రభావిత విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలి. వారి అవసరాలు గుర్తించి సాయంచేయాలి.  

► పౌష్ఠికాహార అవసరాలు గుర్తించి వారి వ్యాధి నిరోధకత పెంపునకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజనం వేడివేడిగా అందేలా చూడాలి. పాఠశాల మూసి ఉన్న సమయాల్లో, లేదా వేసవి సెలవుల్లో తత్సమాన ఆహార భద్రత భృతి చెల్లించాలి.

మరిన్ని వార్తలు