Lakhimpur Kheri violence: చీపురుపట్టిన ప్రియాంక; వైరల్‌ వీడియో

4 Oct, 2021 13:28 IST|Sakshi

రక్తమోడిన లఖీమ్‌పూర్ ఖేరీ 

జిల్లాలో ప్రియాంక గాంధీ పర్యటన

అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్తంగా పరిస్థితి

గెస్ట్‌హౌస్‌లో గదిని స్వయంగా శుభ్రం చేసుకున్న ప్రియాంక

లక్నో: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆదివారం రైతులు చేపట్టిన ఉద్యమం మరోసారి హింసాత్మకంగా మారింది. లఖింపూర్ ఖేరీ నిరసనల్లో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు విపక్ష నేతలు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి  ప్రియాంకా గాంధీని సీతాపూర్‌లో సోమవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా  పోలీసులతో వాగ్వాదం జరిగిన నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.  గెస్ట్‌హౌస్‌లోని గదిని స్వయంగా ప్రియాంక గాంధీ చీపురుతో శుభ్రం చేస్తూ  ట్రెండింగ్‌లో నిలిచారు.

ప్రియాంకతోపాటు, పార్టీ శాసనసభ్యుడు దీపేంద్ర సింగ్ హుడా తదితరులనుకూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రియాంక గాంధీని సీతాపూర్-లఖింపూర్ సరిహద్దులోని హర్గావ్ సమీపంలో ఒక గెస్ట్‌హౌస్‌లో ప్రియాంక గాంధీని కస్టడీలో ఉంచారని కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగం నేత ట్వీట్‌ చేశారు. దీంతోపాటు గెస్ట్‌హౌస్‌లోని గది ఫ్లోర్‌ని తుడుచుకుంటున్న వీడియోను ట్వీట్ చేశారు. పోలీసుల నిర్బంధంలోనే తమ నేత ప్రియాంక నిరాహార దీక్ష ప్రారంభించారని, బాధితుల కుటుంబాలు, రైతులను కలవకుండా తిరిగి వెళ్లేది లేదని కాంగ్రెస్‌ నేతలు స్పష్టం చేశారు. లఖింపూర్ ఖేరీ  బాధితులను కలవడానికి తమను అనుమతించలేదని ఆరోపించిన కాంగ్రెస్‌ న్యాయం కోసం చివరి శ్వాస వరకు పోరాడుతామని  ప్రకటించింది.

మరోవైపు లఖింపూర్ ఖేరీ వెళ్తానని యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రకటించడంతో ఆయన నివాసం ముందు భారీఎత్తున పోలీసులను మోహరించారు. ఆ తరువాత అఖిలేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సమాజ్ వాది పార్టీ మద్దతుదారులు పోలీసు జీప్‌కు నిప్పుపెట్టారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతు బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు బయలు దేరిన పలువురు ప్రతిపక్ష నేతలను సోమవారం యూపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు