సముద్రాల గుట్టు ఛేదించే ‘మత్స్య యంత్రం’

20 Sep, 2022 07:13 IST|Sakshi

సముద్రయాన్‌ ప్రాజెక్టు కింద డీప్‌ వాటర్‌ వెహికల్‌ అభివృద్ధి 

మన దేశానికి 7,500 కిలోమీటర్లకుపైగా సముద్ర తీరం ఉంది. బంగాళాఖాతం, హిందూ మహా సముద్రం, అరేబియా సముద్రం.. మూడూ మూడు దిక్కుల్లో ఆవరించి ఉన్నాయి. ఎంతో మత్స్య సంపదకు, మరెన్నో వనరులకు, చిత్రవిచిత్రాలకు సముద్రాలు పుట్టినిల్లు. వాటి అడుగున ఉండే చిత్రవిచిత్రాలూ ఎన్నో. ఈ క్రమంలోనే సముద్ర అడుగున పరిశోధనలు, వనరుల వెలికితీత కోసం భారత్‌ ‘సముద్రయాన్‌’ప్రాజెక్టును చేపట్టింది. ఆ వివరాలేమిటో చూద్దామా.. 

సముద్రాల్లో మత్స్య సంపద మాత్రమేగాకుండా ఖనిజాలు, మూలకాలు వంటి ఎన్నో వనరులు ఉన్నాయి. వాటిని గుర్తించడం, వెలికితీసి వినియోగించుకోవడం.. సముద్ర ఆధారిత ఎకానమీని అభివృద్ధి లక్ష్యంగా భారత్‌ ‘డీప్‌ ఓసియన్‌ మిషన్‌’ను ప్రారంభించింది. ఇందులో భాగంగా వేల మీటర్ల లోతుకు వెళ్లగలిగే ప్రత్యేక వెహికల్స్‌ను, సాంకేతికలను అభివృద్ధి చేయనుంది. ఈ క్రమంలో రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనా దేశాలతో కలిసి పనిచేయనుంది.

ఆరు వేల మీటర్ల అడుగుకు వెళ్లగలిగేలా.. 
సముద్రయాన్‌ ప్రాజెక్టులో భాగంగా.. సముద్రాల అడుగున మానవ సహిత ప్రయోగాల కోసం ప్రత్యేకమైన వాహనాన్ని (డీప్‌ వాటర్‌ సబ్‌ మెర్సిబుల్‌ వెహికల్‌)ను భారత్‌ అభివృద్ధి చేయనుంది. ముగ్గురు శాస్త్రవేత్తలు ఆరు వేల మీటర్ల (ఆరు కిలోమీటర్లు) లోతుకు వెళ్లి పరిశోధనలు చేయగలిగేలా దాన్ని రూపొందిస్తున్నారు. అందులో వివిధ సెన్సర్లు, శాస్త్రీయ పరికరాలు, సముద్రం అడుగున తవ్వడం, కదిలించడానికి వీలయ్యే ఉపకరణాలు ఉంటాయి. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషియన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఓటీ) శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలకు నేతృత్వం వహించనున్నారు. 


మత్స్య 6000 పేరుతో.. 
ఇస్రో, ఐఐటీ మద్రాస్, డీఆర్‌డీవో తదితర సంస్థల సహకారంతో ఎన్‌ఐఓటీ శాస్త్రవేత్తలు ఇప్పటికే ‘మత్స్య 6000’పేరుతో డీప్‌ వాటర్‌ వెహికల్‌ ప్రాథమిక డిజైన్‌ను రూపొందించారు. గోళాకారంలో రూపొందించిన ఈ డీప్‌ వాటర్‌ వెహికల్‌ను సిద్ధం చేయడానికి సుమారు రూ.350 కోట్లు ఖర్చవుతుందని అంచనా. 

► సముద్రాల అడుగున అత్యంత తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. నీటి సాంద్రత, విజిబిలిటీ వంటివి భిన్నంగా ఉంటాయి. వీటిని తట్టుకునేలా డీప్‌వాటర్‌ వెహికల్‌ను రూపొందించాల్సి ఉంటుంది. అంతేగాకుండా ఆ లోతుల్లో పనిచేసే సెన్సర్లు, పరికరాలను, ఆక్సిజన్, అత్యవసర రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సి ఉండనుంది. 

► మొదట ఈ ఏడాది చివరినాటికి 500 మీటర్ల లోతు వరకు వెళ్లే డీప్‌ వాటర్‌ వెహికల్‌ను రూపొందించనున్నారు. 2024 మార్చి నాటికి పూర్తిస్థాయి ‘మత్స్య 6000’వాహనాన్ని సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

► సముద్రాల్లో వెయ్యి మీటర్ల నుంచి 5,500 మీటర్ల లోతు వరకు గ్యాస్‌ హైడ్రేట్లు, మాంగనీస్, సలై్ఫడ్లు, కోబాల్ట్‌ వంటి ఖనిజాలు లభిస్తాయి. వాటిని వెలికితీసే అవకాశాలను ఎన్‌ఐఓటీ శాస్త్రవేత్తలు పరిశీలించనున్నారు. 

► ‘మత్స్య 6000’సాయంతో దేశం చుట్టూ ఉన్న సముద్రాల అడుగున జీవజాలంపై పరిశోధనలు చేయనున్నారు. సముద్రాల్లో మునిగిన ఓడలు, ఇతర వస్తువుల పరిశీలన సేకరణ, నీటి అడుగున ఫైబర్‌ కేబుళ్లు, ఇతర పరికరాల ఏర్పాటు, మరమ్మతులకు దీనిని వినియోగించుకోనున్నారు.

ఇదీ చదవండి: టెన్షన్‌ పెడుతున్న కొత్త రకం బ్యాంకింగ్‌ వైరస్‌.. స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులూ జాగ్రత్త!

మరిన్ని వార్తలు