మేం మర్చిపోం, మర్చిపోనివ్వం: ఫడ్నవీస్‌

12 Sep, 2020 10:59 IST|Sakshi

పాట్నా: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యను రాజకీయంగా వాడుకుంటున్నారని కాంగ్రెస్‌ పార్టీ నేతలు బీజేపీపై మండిపడ్డారు. అందుకే బిహార్‌లో సుశాంత్‌ పోస్టర్లను దేవేంద్ర ఫడ్నవీస్‌ పెట్టించారని ఆరోపించారు. సుశాంత్‌ మరణాన్ని అడ్డుపెట్టుకొని ఓటు బ్యాంక్‌ రాజకీయాలు చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. బిహార్‌ ఎన్నికల్లో బీజేపీ ప్రచారానికి ఫడ్నవీస్‌ సారథ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బిహార్‌లో వెలిసిన సుశాంత్‌ పోస్టర్లు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. 

దీని గురించి ఫడ్నవీస్‌ స్పందిస్తూ ‘మేం సుశాంత్‌ సింగ్‌ మరణాన్ని రాజకీయాలకు వాడుకోవాలనుకోవడంలేదు. సుశాంత్‌ విషయం జరగకముందు నుంచే నేను బిహార్‌ ఎన్నికల కోసం పని చేస్తున్నాను. ఈ విషయం కామన్‌ మ్యాన్‌ భావాలకు స్పందించింది. సుశాంత్‌కు తప్పకుండా న్యాయం జరుగుతుంది. న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు. అందుకే మేం చెబుతున్నాం మర్చిపోము, మర్చిపోనివ్వము’ అని పేర్కొన్నారు. మహారాష్ట్రలో బీజేపీ మెజారిటీ స్థానాలు సాధించినప్పటికీ అనుకోని పరిస్థితులలో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక శివసేన ప్రభుత్వంపై ఫడ్నవీస్‌ విమర్శలు గుప్పించారు. మహారాష్ట్ర గవర్నమెంట్‌ కరోనాపై యుద్ధం ముగిసిందని భావించి ప్రస్తుతం కంగనాపై యుద్ధం మొదలుపెట్టిందని ఎద్దేవా చేశారు.  

చదవండి: ‘సుశాంత్‌ రోజుకు 5 సార్లు డ్రగ్స్‌ తీసుకునేవాడు’

మరిన్ని వార్తలు