విమానంలో మూత్ర విసర్జన ఘటన.. ఎయిరిండియాకు డీజీసీఏ షాక్‌.. భారీ పెనాల్టీ

20 Jan, 2023 14:17 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎయిరిండియా మూత్రవిసర్జన కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ(డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌).. ఎ‍యిర్‌ ఇండియాకు భారీ షాక్‌ ఇచ్చింది. ఘటనకుగానూ శుక్రవారం రూ.30 లక్షల పెనాల్టీ ఎయిర్‌ ఇండియాకు విధించింది. అంతేకాదు.. ఆ సమయంలో విమానంలో ఉన్న పైలట్‌ ఇన్‌ కమాండ్‌  లైసెన్స్‌ను మూడు నెలలపాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. వీటితో పాటు ఎయిర్‌ ఇండియా డైరెక్టర్‌ ఇన్‌ ఫ్లైట్‌ సర్వీసెస్‌కు రూ.3 లక్షల ఫైన్‌ విధించింది. 

ఘటన సమయంలో సరైన స్పందన లేకపోవడం, పైగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం లాంటి పరిణామాల ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది డీజీసీఏ. గతేడాది నవంబర్‌ 26వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. న్యూయార్క్‌–న్యూఢిల్లీ ఎయిర్‌ ఇండియా విమానంలో బిజినెస్‌ క్లాస్‌లో 70 ఏళ్ల సహ ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేశాడు శంకర్‌ మిశ్రా. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రాగా.. దుమారం చెలరేగింది. అప్పటికప్పుడు పార్టీల మధ్య రాజీ కుదరిందనుకుని ఈ వ్యవహారాన్ని వదిలేసినట్లు ఎయిర్‌ ఇండియా ప్రకటించుకుంది. అయితే.. వృద్ధురాలి ఫిర్యాదుతో ఈ ఏడాది జనవరి 4వ తేదీన ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. నిందితుడిని తీవ్రంగా గాలించి అరెస్ట్‌ చేశారు. 

ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చాక ఎయిరిండియా నిందితుడు శంకర్‌ మిశ్రాను నాలుగు నెలలపాటు నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. మద్యం మత్తులో ఈ నేరానికి పాల్పడినందుకు.. తప్పించుకునే ప్రయత్నం చేసినందుకు శంకర్‌ అరెస్ట్‌ కాగా, సాక్ష్యులను బెదిరించడం.. తారుమారు చేసే అవకాశం ఉండడంతో బెయిల్‌కు నిరాకరించింది కోర్టు. 

మరిన్ని వార్తలు