అలర్ట్‌: మాస్క్‌ ధరించకుంటే విమానం నుంచి దించేస్తారు!

8 Jun, 2022 19:11 IST|Sakshi

న్యూఢిల్లీ: విమాన ప్రయాణికులకు అలర్ట్‌. ఎయిర్‌పోర్ట్‌లోగానీ, విమానంలోగానీ మాస్క్‌ ధరించకుంటే అనుమతించకూడదని కేంద్ర పౌర విమానయాన నియంత్రణ సంస్థ ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ మాస్కులు ధరించకుంటే.. దించేయాలని తెలిపింది. అంతేకాదు.. ప్రయాణం మొత్తంలో మాస్క్‌ను తప్పనిసరి చేస్తూ ఆ ఆదేశాల్లో పేర్కొంది.

ఈ మేరకు డైరెక్టోరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎయిర్‌పోర్ట్‌, విమానాల్లో కరోనా నిబంధనలు పాటించకుంటే.. ప్రయాణికులను అనుమతించకూడదని స్పష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలోనే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. 

విమానాశ్రయాలు, విమానాల్లో ప్రయాణికులు మాస్కులు ధరించేలా చూడాలంటూ ఢిల్లీ హైకోర్టు.. రెగ్యులేటరీ బాడీని ఆదేశించింది. మాస్క్‌లు ధరించడం నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని, పదే పదే హెచ్చరించినా పట్టించుకోపోతే వాళ్లను.. నిబంధనలను పాటించని ప్రయాణికుల జాబితాలో చేర్చి, తదనంతర చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. 

Mask Must ఈ తరుణంలో.. డీజీసీఏ ఆదేశాలనుసారం మాస్క్‌లు ధరించని ప్రయాణికులపై చర్యలు తీసుకోనున్నారు ఎయిర్‌పోర్ట్‌ నిర్వాహకులు. అలాంటి ప్రయాణికులను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకునే హక్కు కూడా కల్పించారు. ప్రయాణాల్లో కేవలం ప్రత్యేక కారణాలు చూపిస్తేనే.. మాస్క్‌ తొలగించే అవకాశం కల్పిస్తారు.

మరిన్ని వార్తలు