గన్ను కాదు.. పెన్ను పట్టండి

14 Oct, 2021 08:10 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న ఆయుధాలను పరిశీలిస్తున్న డీజీపీ అభయ్, అధికారులు

మావోయిస్టులకు డీజీపీ అభయ్‌ పిలుపు 

చిన్నారులు, కుటుంబ సభ్యుల భవిష్యత్‌ కోసం వివేచించాలని హితవు 

ఎన్‌కౌంటర్‌లో భాగస్వామ్యమైన మూడు రాష్ట్రాల దళాలకు అభినందనలు  

మల్కన్‌గిరి: కుటుంబ సభ్యులకు శాంతియుత జీవనాన్ని అందించేందుకు మావోయిస్టులు జనజీవన శ్రవంతిలోకి రావాలని రాష్ట్ర డీజీపీ అభయ్‌ కోరారు. చిన్నారులకు బంగారు భవిష్యత్‌ కోసం గన్ను పట్టిన చేతులతో పెన్ను అందించాలని పిలుపునిచ్చారు. కొరాపుట్‌ జిల్లాలోని మత్తిలి సమితి తులసిపహడ్‌లో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ఆయన జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని బుధవారం సందర్శించారు. ఎన్‌కౌంటార్‌లో భాగస్వామ్యమైన ఆంధ్రప్రదేశ్, ఛత్తిస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలు పోలీసు అధికారులతో రహస్య సమావేశం నిర్వహించారు.

మావోయిస్టులను ఎలా అణచి వేయాలనే కార్యచరణపై చర్చించారు. మల్కన్‌గిరి జిల్లా సరిహద్దులో ముడు రాష్ట్రాల పోలీసు బృందాలతో సంయుక్తంగా కూంబింగ్‌ జరపాలని సూచించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో హింసకు తావు లేదని స్పష్టంచేశారు. మల్కన్‌గిరి జిల్లా ప్రస్తుతం అధివృద్ధి పథంలో నడుస్తోందని, స్థానిక కటాఫ్‌ ఏరియాలో అమాయక గిరిజనులను తప్పదోవ పట్టించవద్దని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వం మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేస్తోందన్నారు.

వీటిని దృష్టిలో పెట్టుకొని, కుటుంబాలకు ప్రశాంతమైన జీవనాన్ని అందించేందుకు జనంలోకి రావాలని సూచించారు. అలాగే ఎన్‌కౌంటర్‌లో పాలుపంచుకున్న పోలీసు దళాలను డీజీపీ అభినందించారు. అనంతరం ఎన్‌కౌంటర్‌లో స్వా«దీనం చేసుకొన్న మృతదేహలు, ఇతర సామగ్రీని విలేకర్ల ముందు ప్రదర్శించారు.  

ముగ్గురివీ.. మూడు రాష్ట్రాలు 
ఎన్‌కౌంటర్‌లో పోలీసులు స్వా«దీనం చేసుకున్న ఆయుధాల్లో ఎస్‌ఎల్‌ఆర్‌ రైఫిల్‌(1), ఏకే–47(1), ఎస్‌ఎల్‌ఆర్‌ మ్యాగజైన్‌లు(3), కిట్‌ బ్యాగ్‌లు, బుల్లెట్లు, వాకీటాకీలు, మావోయిస్టు సాహిత్యం, విద్యుత్‌ వైర్లు, రేడియో, కత్తులు, జిలిటెన్‌ స్టిక్‌లు, ఇతర సామగ్రీ ఉన్నాయి. మృతిచెందిన మావోయిస్టులలో... మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి సుదకొండ గ్రామానికి చెందిన అనీల్‌ అలియాస్‌ కిషోర్‌ అలియాస్‌ దాసరి అలియాస్‌ ముకసోడి. ఆంధ్ర–ఒడిశా స్పెషల్‌ జోనల్‌ కమిటీలో ఏసీఎంగా ఉన్నాడు. ఆయనపై రూ.5 లక్షల రివార్డు ఉంది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన సోనీపై రూ.4 లక్షలు రివార్డు ఉంది.

ఆమె మావోయిస్టు అగ్రనేత అరుణక్క రక్షణ బృందంలో ఏసీఎంగా పని చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా పెదబాయిల్‌ గ్రామానికి చెందిన చిన్నారావు పార్టీ సభ్యుడు ఉన్నారు. అరుణక్క రక్షణ బృందంలోనే పని చేస్తున్నాడు. ఇతనిపై రూ.లక్ష రివార్డు ఉంది. పర్యటనలో ఐజీ ఆపరేషన్స్‌ అమితాబ్‌ ఠాకూర్, ఇంటిలిజెన్స్‌ డీఐజీ అనువృద్ధసింగ్, దక్షణాంచల్‌ డీఐజీ రాకేష్‌ పండిట్, మల్కన్‌గిరి ఎస్పీ ప్రహ్లాద్‌స్వొయి మిన్నా, ఇతర పోలీసుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు