‘వజ్రం’ దొరికింది.. వేట మొదలు పెట్టారు!

28 Nov, 2020 09:19 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కోహిమా: ఫ్రీగా వస్తే ఫినాయిలైనా తాగుతారని వింటుంటాం. అదే వజ్రమే దొరికితే ఎవరైనా తీసుకోకుండా ఉంటారా..? అదే జరిగితే ఒక్కరోజులోనే కోటీశ్వరులం అయిపోవచ్చని చాలా మంది కలలు కంటూ ఉంటారు. ఇందుకోసం ఎంత కష్టాన్నైనా భరించేందుకు సిద్ధపడతారు. అలాంటి ఆలోచనతోనే నాగాలాండ్‌ ప్రజలు ఇప్పుడో వేట మొదలు పెట్టారు. అదే వజ్రాల వేట... తాజాగా ఓ రైతుకు వజ్రాన్ని పోలిన రాయి దొరకడంతో, ఇప్పుడు కొండ ప్రాంతంలో అనేక మంది ప్రజలు చెట్టు చేమ అని చూడకుండా తవ్వడం మొదలు పెట్టారు. దొరికితే అదృష్టమే అన్నట్టుగా తవ్వుతున్న ఆ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వం ఆ రాయి అసలు వజ్రమో కాదో కనుక్కునే పనిని భూ విజ్ఞాన శాస్త్రవేత్తలకు అప్పజెప్పింది.  (చదవండితీరంలో కొనసాగుతున్న ‘పసిడి’ వేట)

అబెంతంగ్‌ లోథా, లంగారికబా, కెనైలో రెగ్మా, డేవిడ్‌ లుఫోనియాలను త్వరగా రిపోర్ట్‌ అందించాలని నాగాలాండ్‌ జియాలజీ, మైనింగ్‌ డైరెక్టర్‌ మనేన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రాంతంలో పూర్వం నుంచి వజ్రాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించనందున ఆ రాయి అసలు వజ్రమని బృందం నమ్మడం లేదు. వీరు నవంబర్‌ 30న లేదా డిసెంబర్‌ 1న అక్కడికి చేరుకొని పరిశోధనలు చేపట్టనున్నారు. సోషల్‌ మీడియాలో పెడుతున్న పోస్టులను ఆపేయాలని, ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిపేవేయాలని  బృందం ఉత్తర్వులు జారీ చేసినట్టుగా జాతీయ మీడియా పేర్కొంది.

మరిన్ని వార్తలు