ఇ–సంజీవనితో డిజిటల్‌ విప్లవం

27 Feb, 2023 03:21 IST|Sakshi

నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: భారత్‌లో డిజిటల్‌ విప్లవం తన సత్తా చాటుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇ–సంజీవని యాప్‌ దీనికి నిదర్శనమని చెప్పారు. ఆన్‌లైన్‌లో మెడికల్‌ కన్సల్టేషన్‌ చేసే ఈ యాప్‌ ద్వారా 10 కోట్ల మందికి పైగా లబ్ధి పొందారని తెలిపారు. ప్రతీ నెల చివరి ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ సాధారణ ప్రజలు, మధ్యతరగతి వారు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి ఈ యాప్‌ ప్రాణ రక్షణగా మారిందని చెప్పారు.

ఈ యాప్‌ ఒక్కటి చూసి భారత్‌ డిజిటల్‌ పవర్‌ ఏంటో చెప్పవచ్చునని అన్నారు. ఒక డాక్టర్, ఒక రోగితో మాట్లాడిన ఆయన, ఇ–సంజీవని యాప్‌ ఎంత ఉపయోగకరమో వివరించారు. ‘‘ఇది మనం సాధించిన అతి పెద్ద ఘనత. భారత దేశ ప్రజలు టెక్నాలజీని మన జీవితంలో ఎలా భాగం చేసుకున్నారో చెప్పడానికి ఇది సజీవ సాక్ష్యం. కరోనా సమయంలో ఈ యాప్‌ ప్రజలందరికీ ఒక వరంలా మారడం మనం కళ్లారా చూశాము’’ అని ప్రధాని చెప్పారు.

ఇక నగదు చెల్లింపుల్లోనూ యునిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) సరికొత్త పుంతలు తొక్కుతోందని అన్నారు. సింగపూర్‌కు చెందిన పేనౌకి కూడా యాక్సెస్‌ లభించడంతో రెండు దేశాల ప్రజల మధ్య కూడా డిజిటల్‌ చెల్లింపులు మరింత సులభతరంగా మారాయన్నారు. యూపీలో కొత్తగా నియమితులైన పోలీసులనుద్దేశించి మోదీ మాట్లాడారు. లక్నోలో ఉద్యోగ మేళాలో 9 వేల మందికి ఆయన నియామక పత్రాలిచ్చారు.

నేడు కర్ణాటకకు ప్రధాని 
అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్నాటకలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం పర్యటించనున్నారు. రూ.450 కోట్లతో నిర్మించిన శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఏడాది కర్ణాటకలో ప్రధాని పర్యటించడం ఇది ఐదోసారి!  

మరిన్ని వార్తలు