రాహుల్‌ సమక్షంలోనే సీట్ల సర్దుబాటు..

3 Dec, 2020 07:24 IST|Sakshi

డీఎంకే, కాంగ్రెస్‌ మధ్య సీట్ల సర్దుబాటు 

స్టాలిన్‌తో కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ గుండూరావు భేటీ 

సాక్షి, చెన్నై: కాంగ్రెస్‌–డీఎంకేల మధ్య కూటమి దోస్తీ కొనసాగడం ఖాయమైంది. అసెంబ్లీ ఎన్నికల వేళ డీఎంకే కూటమి భాగస్వామైన కాంగ్రెస్‌ సీట్ల సర్దుబాటుపై బుధవారం తొలి అడుగువేసింది. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దినేష్‌ గుండూరావు, డీఎంకే అధ్యక్షులు స్టాలిన్‌తో చర్చ లు జరిపారు. కాంగ్రెస్‌ కోరినన్ని సీట్ల కేటాయింపు డీఎంకేకు సంకటంగా, సవాలుగా మారనుంది.  వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సన్నా హాలపై అన్ని పార్టీలు తలమునకలై ఉన్నాయి. తమిళనాడు ఏ ఎన్నికలు వచ్చినా అన్నాడీఎంకే, డీఎంకే కూటముల మధ్యనే ప్రధాన పోటీ అనాధిగా కొనసాగుతోంది. అన్నాడీఎంకే, బీజేపీ కూటమి ఖరారైంది. డీఎంకే పదేళ్లుగా ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. ఈసారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది. రాబోయే ఎన్నికలను డీఎంకే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

డీఎంకే కూటమిలో అనేక పార్టీలుండగా వీటిల్లో కాంగ్రెస్‌ ప్రధానమైనది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ రెండురోజుల క్రితం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తమిళనాడు కాంగ్రెస్‌ నేతలతో భేటీ అయ్యారు. డీఎంకే కూటమిలో కొనసాగాలని, అపుడే గెలుపు సాధ్యమని కాంగ్రెస్‌ నేతలంతా రాహుల్‌ను కోరారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దినేష్‌ గుండూరావు బుధవారం చెన్నైకి చేరుకున్నారు. రాహుల్‌ ఆదేశాలకు అనుగుణంగా డీఎంకేతో కూటమిని ఖరారు చేసేందుకు, సీట్ల సర్దుబాటుపై చర్చించేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేఎస్‌ అళగిరి   తోపాటు స్టాలిన్‌ను కలిశారు.

డీఎంకే కూటమిలో ఉంటూ గత అసెంబ్లీ ఎన్నికల్లో 41 స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్‌ కేవలం 8 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఈ కారణంగా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డీఎంకే అధికసీట్లు కేటాయించే అవకాశం లేదని తెలుస్తోంది. కాంగ్రెస్‌ 45 సీట్లు కోరుతుండగా డీఎంకే 25– 30 స్థానాలను మాత్రమే కేటాయించాలని భావిస్తున్నట్లు సమాచారం. కమల్‌హాసన్‌ సారథ్యంలోని మక్కల్‌ నీది మయ్యంను డీఎంకే కూటమిలో కలుపుకుంటే మెజార్టీ స్థానాల్లో గెలుపొందవచ్చని కొందరు కాంగ్రెస్‌ నేతలు సూచిస్తున్నట్లు సమాచారం.  

రాహుల్‌గాంధీ చెన్నైకి రానున్నారు: గుండూరావు 
ఎన్నికల వ్యూహం, పోటీచేయదలచుకున్న స్థానాల అంశాలపై చర్చలు జరిపేందుకు త్వరలో రాహుల్‌గాంధీ చెన్నైకి రానున్నారని దినేష్‌ గుండూరావు తెలిపారు. డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నాఅరివాలయంలో బుధవారం రాత్రి స్టాలిన్‌ను ఆయన కలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎన్ని సీట్లలో పోటీచేయాలనే అంశంపై రాహుల్‌గాంధీ సమక్షంలోనే డీఎంకేతో చర్చలు జరుగుతాయని చెప్పారు. డీఎంకే కూటమి బలోపేతం చేయడం ఎలా అనే అంశంపై మాత్రమే స్టాలిన్‌తో మాట్లాడాం. సీట్ల సర్దుబాటు అంశం ఈరోజు అజెండా కాదని వ్యాఖ్యానించారు.  

మరిన్ని వార్తలు