National Herald Case: రెండో రోజు 11 గంటలు 

15 Jun, 2022 05:25 IST|Sakshi
ప్రియాంక, ఇతర కాంగ్రెస్‌ నేతలతో కలిసి ఈడీ విచారణకు బయల్దేరిన రాహుల్‌గాంధీ

రాహుల్‌ను విచారించిన ఈడీ 

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో పలు అంశాలపై లోతుగా ప్రశ్నలు 

నేడు మళ్లీ రావాలని ఆదేశం 

కొనసాగిన కాంగ్రెస్‌ నిరసనలు

న్యూఢిల్లీ:  నేషనల్‌ హెరాల్డ్‌ వార్తా పత్రిక మనీ లాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీని మంగళవారం రెండో రోజు కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) 11 గంటలకు పైగా సుదీర్ఘంగా విచారించింది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి బయల్దేరి ఉదయం 11.05కు సోదరి ప్రియాంకతో కలిసి ఆయన ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. 11.30కు విచారణ ప్రక్రియ మొదలైనట్టు అధికారులు తెలిపారు. నాలుగు గంటల అనంతరం మధ్యాహ్న.ం 3.30కు భోజన విరామమిచ్చారు. తర్వాత 4.30 నుంచి రాత్రి 11.30 దాకా విచారణ సాగింది.

నేషనల్‌ హెరాల్డ్‌–ఏజేఎల్‌–యంగ్‌ ఇండియా లావాదేవీలకు సంబంధించిన కీలక అంశాలపై రాహుల్‌ను మరింత లోతుగా ప్రశ్నించి ఆయన సమాధానాలను, వివరణను రికార్డు చేసినట్టు చెబుతున్నారు. వాటిని రాహుల్‌ కూలంకషంగా పరిశీలించినట్టు సమాచారం. అధికారులు తరచూ విరామమిస్తూ విచారణ కొనసాగించారని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.

బుధవారం కూడా విచారణకు రావాలని ఈడీ అధికారులు రాహుల్‌ను ఆదేశించారు. ఒక క్రిమినల్‌ కేసులో గాంధీ కుటుంబ వ్యక్తి ఒకరిని దర్యాప్తు సంస్థలు విచారించడం ఇదే తొలిసారి. రాహుల్‌ను సోమవారం తొలి రోజు 10 గంటలకు పైగా ఈడీ విచారించడం తెలిసిందే. ఈ కేసులో కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీని కూడా 23న ఈడీ విచారించనుంది. రాజస్తాన్‌లో ఓ భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో ప్రియాంక భర్త రాబర్ట్‌ వద్రాను ఈడీ కొన్నేళ్ల క్రితం విచారించింది. 

భారీగా అరెస్టులు 
విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు సోమవారం మాదిరిగానే నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ఢిల్లీలో ఆందోళనలు కొనసాగించారు. ఉదయం రాహుల్‌ నేతృత్వంలో ఏఐసీసీ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జైరాం రమేశ్, రణ్‌దీప్‌ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్, అధీర్‌ రంజన్‌ చౌధరి, దీపీందర్‌ హుడా, పలువురు పార్టీ ఎంపీలు, సీఎంలు అశోక్‌ గెహ్లాట్, భూపేశ్‌ భగెల్‌ తదితర నేతలను పలు పోలీస్‌ స్టేషన్లకు తరలించారు.

ఈడీ విచారణను కేంద్రం రాజకీయ కక్షసాధింపు చర్యగా ఈ సందర్భంగా నేతలు అభివర్ణించారు. విచారణను తప్పించుకునేందుకు నిరసనల పేరిట కాంగ్రెస్‌ ఇలా డ్రామాలాడుతోందని బీజేపీ దుయ్యబట్టింది. 

మరిన్ని వార్తలు