భయపడేది లేదు.. ప్రాణం ఉన్నంత వరకు పోరాడతా: స్వాతి మలివాల్‌

21 Jan, 2023 14:06 IST|Sakshi

న్యూఢిల్లీ: బీజేపీ వ్యాఖ్యలపై ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ స్వాతి మలివాల్‌  తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బెదిరింపులు తనను ఆపలేవని, ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు.. అసలేం జరిగిందంటే.. రెండు రోజుల క్రితం స్వాతి మలివాల్‌ను మద్యం మత్తులో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో మహిళా భద్రతను పర్యవేక్షిస్తున్న క్రమంలో బుధవారం రాత్రి ఎయిమ్స్‌ సమీపంలోని రోడ్డు వద్ద మద్యం సేవించిన కారు డ్రైవర్‌ ఆమెను లైంగికంగా వేధించాడు. కారులో ఎక్కాలని బలవంతం చేశాడు. దీంతో ఆగ్రహించిన స్వాతి మలివాల్‌.. కారు డ్రైవర్‌ను కిటికీలోంచి బయటకు లాగేందుకు ప్రయత్నించింది.

ఈ క్రమంలో ఆమె చేయి విండోలోపల ఉండగానే డ్రైవర్‌ కారు అద్దాలను పైకి ఎక్కించి 15 మీటర్లు మాలివాల్‌ను లాక్కెళ్లాడు. ఈ విషయంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన  వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీలో మహిళా చైర్‌ పర్సన్‌కే భదత్ర లేకుండా సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని స్వాతి మలివాల్‌ అన్నారు. దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని లేపుతున్న ఈ ఘటనపై బీజేపీ స్పందించింది.

వీడియోపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. స్వాతి మలివాల్‌ ఆరోపించిన వ్యక్తి ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన వ్యక్తి అని పేర్కొంది. ఢిల్లీ పోలీసుల ప్రతిష్ట దెబ్బతీసేందుకే ఆప్‌తో కుమ్మకై వీడియో తీసినట్లుగా ఉందని విమర్శించింది. ఘటన జరిగిన వెంటనే స్వాతి ఎందుకు స్పందించలేదని బీజేపీ అధికార ప్రతినిధి హరీష్ ఖరానా ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే ఈ ఘటన అంతా సృష్టించినట్లుగా ఉందని ఆయన విమర్శించారు.

బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై స్వాతి మలివాల్‌ ఘాటుగా స్పందించారు. బీజేపీ ఆరోపణలు పచ్చి అబద్దాలుగా పేర్కొంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా కాషాయ పార్టీపై నిప్పులు చెరిగారు. ‘“నా గురించి బూటకపు అబద్ధాలు చెబితే భయపెడతానని అనుకునే వాళ్ళకి ఓ విషయం చెప్పాలి. ఈ చిన్న జీవితంలో ఎన్నో సవాళ్లను, కష్టాలను ఎదుర్కొని నిలబడ్డాను.  ఇప్పటి వరకు నాపై ఎన్నోసార్లు దాడి జరిగాయి. అవేవి నా ప్రశ్నించే గొంతుకను ఆపలేదు. వాస్తవానికి నాలోని దైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని పెంచాయి. నేను బతికి ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటాను’ అని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు