ఉపాధ్యాయుడి మందలింపు.. ఆత్మహత్యకు ప్రేరేపితం కాదు

6 Oct, 2021 07:38 IST|Sakshi

సుప్రీంకోర్టు స్పష్టీకరణ 

సాక్షి, న్యూఢిల్లీ: పాఠశాలలో ఉపాధ్యాయుడు మందలించినంత మాత్రాన దాన్ని విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడానికి కారణంగా చూడలేమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 306 వర్తించజాలదని పేర్కొంది. రాజస్థాన్‌లోని నేవ్‌త్‌ గ్రామంలో సెయింట్‌ గ్జేవియర్స్‌ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి 26.4.2018న ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడు రోజుల అనంతరం స్కూలు పీఈటీ వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ విద్యార్థి తల్లి పోలీసులను ఆశ్రయించారు.

స్కూలు పీఈటీ జియో వేధింపుల కారణంగానే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని, సూసైడ్‌ నోట్‌లో ఈ విషయాన్ని పేర్కొన్నాడని ఫిర్యాదులో తెలిపారు. మూడు పేజీల సూసైడ్‌ నోట్‌లో తొలి పేజీలో తన వస్తువులు సోదరుడుకి ఇవ్వాలని, రెండో పేజీలో న్యాయం కావాలని, మూడో పేజీలో జియో సార్‌కు ధన్యవాదాలు అని విద్యార్థి రాసినట్లు తెలిపారు. పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 306 కింద కేసు నమోదు చేశారు. దీంతో ఎఫ్‌ఐఆర్‌ కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు పిటిషన్‌ కొట్టివేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనల అనంతరం మంగళవారం జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్, జస్టిస్‌ కృష్ణమురారిలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.  

చదవండి:  (కోవిడ్‌ విధుల్లోని అంగన్‌ వాడీలకు 50 లక్షల బీమా)

‘‘దేశంలో ఆత్మహత్య నేరం కాదు. కానీ ఆత్మహత్యాయత్నం సెక్షన్‌ 309 ప్రకారం నేరంగా పరిగణిస్తాం. ఆత్మహత్యకు ప్రేరణ కూడా ఐపీసీ సెక్షన్‌ 306 కింద నేరంగా పరిగణిస్తాం. సెక్షన్‌ 306 ప్రకారం... ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తికి పదేళ్ల వరకూ జైలు, జరిమానా విధించే అవకాశం ఉంది. ప్రస్తుత విద్యావిధానంలో విద్యార్థిని మందలించడంపై ఎలాంటి చట్టాలు లేవు..  కానీ విద్యార్థి క్రమశిక్షణారాహిత్యాన్ని ఉపాధ్యాయుడు, పాఠశాల అథారిటీలు ఉపేక్షించజాలవు. ఇది ఉపాధ్యాయుడి బాధ్యత మాత్రమే కాదు విద్యా హక్కు చట్టం సెక్షన్‌ 24 (ఈ) ప్రకారం తల్లిదండ్రులు, గార్డియన్లతో ఉపాధ్యాయుడు విద్యార్థి హాజరు, క్రమశిక్షణ, చదువు గురించి సమావేశం కావాలి.

విద్యార్థి తరచూ తరగతులకు గైర్హాజరు కావడాన్ని గుర్తించిన ఉపాధ్యాయుడు మందలించడంతోపాటు ప్రిన్సిపల్‌ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. అంతకుమించి ఏమీ చేయలేదు. అందువల్ల సూసైడ్‌నోట్‌ను దీనికి ఆపాదించాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొంటూ హైకోర్టు ఆదేశాలు కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ఈ తీర్పు సందర్భంగా అర్నాబ్‌ గోస్వామి వర్సెస్‌ మహారాష్ట్ర ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రస్తావించింది. సూసైడ్‌ అనే పదానికి ఐపీసీలో నిర్వచనం లేదని, సాధారణ నిఘంటువులో మాత్రం స్వీయహత్య (సెల్ఫ్‌ కిల్లింగ్‌ ) అని ఉంటుందని పేర్కొంది. అంటే తననుతాను చంపుకొనే లక్ష్యాన్ని సాధించడానికి అనుసరించిన మార్గాలతో 
సంబంధం లేకుండా చేపట్టిన చర్యగా ధర్మాసనం అభివర్ణించింది.    

చదవండి:  ('సరిహద్దుల్లో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటాం')

మరిన్ని వార్తలు