దిశ రవికి మద్దతుగా యువత వినూత్న నిరసన

17 Feb, 2021 16:19 IST|Sakshi
డిజిటల్‌ మీడియా వేదికగా దిశ రవికి మద్దతు తెలుపుతోన్న యువత

డిజిటల్‌ మీడియా వేదికగా దిశ రవికి సంఘీభావం

ట్రెండింగ్‌లో ఫింగర్‌ఆన్‌యువర్‌లిప్స్‌ హ్యాష్‌ట్యాగ్‌

ముంబై: ప్రస్తుతం దేశంలో టూల్‌కిట్‌ వివాదం నడుస్తోంది. రైతుల ఉద్యమానికి సంబంధించిన ఈ టూల్‌కిట్‌ని గ్రెటా థన్‌బర్గ్ షేర్‌ చేశారు. అయితే దీన్ని బెంగళూరుకు చెందిన పర్యావరణ కార్యకర్త దిశ రవి ఎడిట్‌ చేశారని.. ఫలితంగా జనవరి 26న ఎర్రకోట వద్ద హింస చెలరేగిందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో దిశ రవితో పాటు శాంతను ములుక్‌, నికితా జాకోబ్‌ అనే మరో ఇద్దరిని అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. వీరిపై నాన్‌ బెయిల్‌బెల్‌ వారెంట్‌ జారీ చేశారు. అయితే ప్రభుత్వ చర్యలపై దేశ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ క్రమంలో గురువారం డిజిటల్‌ మీడియా వేదికగా యువత ‘‘ప్రభుత్వం తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని దేశంలో ఆందోళనను అణచివేస్తోంది’’ అనే నినాదాన్ని ప్రచారం చేస్తోంది యువత. ఈ మేరకు ‘‘ఫింగర్‌ఆన్‌యువర్‌లిప్స్‌’’, ‘‘ఫ్రీదిశారవి’’ అనే హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో నోటిపై వేలు ఉంచిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తోన్నారు నెటిజనులు. ఫోటోలతో పాటు మరికొందరు ‘‘మీకిది తెలుసా.. సామాన్యులను ఇబ్బందులకు గురి చేసే ప్రభుత్వ చర్యల గురించి అస్సలు మాట్లాడొద్దు’’ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి ఫోటోలు, కామెంట్‌లు సోషల్‌ మీడియాలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. 

ఈ సందర్భంగా పర్యావరణ కార్యకార్త ఒకరు మాట్లాడుతూ.. ‘‘పెదవులపై వేలు ఉంచుకోవడం అనేది ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించడానికే కాక దిశ రవితో పాటు అరెస్ట్‌ అయిన మిగతా వారికి సంఘీభావం తెలపడానికి ప్రతీక. వీరిని ప్రభుత్వం కఠినమైన యూఏపీఏ ఉగ్రవాద నిరోధక చట్టం కింద అరెస్ట్‌ చేసింది. వారికి సంఘీభావంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెదవుల మీద వేలు ఉంచుకుని నిరసన తెలపుతున్నాం. మన దేశంలో ఎవరైనా నిరసన తెలిపితే.. ఉద్యమం చేస్తే.. వారిని సంఘ విద్రోహక శక్తులుగా ముద్రిస్తున్నారు. కానీ వాస్తవం అది కాదు. నిరసన తెలుపుతున్న వారంతా ప్రజల స్థితిగతులు మార్చాలని.. అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తున్న వారు’’ అన్నారు.

‘‘దేశంలో మిడతల దాడి, గత పదేళ్లుగా రైతుల ఆత్మహత్యలు, ఒక్క రోజులోనే ఉల్లి ధర మూడు సార్లు పెరగడం వంటి విషయాల గురించి మీకు తెలిసినప్పుడు.. మీరు దానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడవద్దు. జస్ట్‌ మీ పెదవుల మీద వేలు ఉంచుకోండి.. కామ్‌గా ఉండండి. నియమ్‌గిరి పర్వతాల్లో, గోవాలో అక్రమ మైనింగ్‌ గురించి తెలిసినా.. మొలెం‌ అడవుల్లో కార్చిచ్చు రగిలిందని తెలిసినా.. వచ్చే ఆరేళ్లలో మన భవిష్యత్తు ఒకేలా ఉండదని తెలిసినా మీరు కామ్‌గా ఉండండి.. ఏం మాట్లడకుండా.. మీ పెదవుల మీద వేలు పెట్టుకుని నిశ్శబ్దంగా ఉండండి. ఎందుకంటే దేశంలోని ఏ అంశం మీదనైనా మీరు స్పందిస్తే.. మీ మాటల్ని వక్రీకరించి.. మిమ్మల్ని చట్ట ప్రకారం దోషులుగా ప్రకటించి కోర్టులో నిలబెడతారు. కనుక ఏం జరిగినా కామ్‌గా ఉండండి.. ప్రశ్నించొద్దు’’ అంటూ వ్యంగ్యంగా కామెంట్‌ చేస్తున్నారు నెటజనులు. 

‘‘ఫింగర్స్‌ఆన్‌యువర్‌లిప్స్‌’’ అనేది శాంతియుతమైన డిజిటల్‌ నిరసన ప్రదర్శన. ‘‘సామాన్యులను ఇబ్బంది పెట్టే ప్రభుత్వ పాలసీలకు వ్యతిరేకంగా యువత తమ స్వరాన్ని వినిపిస్తుంది. మౌనంగా ఉండమని వారిని భయపెట్టలేం. అలా చేసిన కొద్ది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే గొంతుకలు పెరుగుతాయి’’ అని తెలియజేయడమే ఈ నిరసన ప్రధాన ఉద్దేశం.

చదవండి: దిశ రవికి గోవధ ఇష్టం ఉండదు.. అందుకే
                 టూల్‌కిట్‌ వివాదం: పాక్‌ కీలక వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు