దిశ రవి.. శుక్రవారం స్ట్రయిక్‌!

20 Feb, 2021 07:15 IST|Sakshi

ఈ సంస్థ ఏం చేస్తుంది? 

న్యూఢిల్లీ: జూలై 2020న బహు తక్కువ మందికి పరిచయం ఉన్న మూడు చిన్న పర్యావరణ పరిరక్షణా బృందాలకు చెందిన వెబ్‌సైట్‌లను మూసివేసి, వారిపైన ఉపా చట్టం ప్రయోగిస్తామని ఢిల్లీ పోలీసులు హెచ్చరించినప్పుడు మొదటసారి వీరి పేర్లు వెలుగులోకి వచ్చాయి. అందులో ఒకటి ప్రస్తుతం టూల్‌కిట్‌ కేసులో అరెస్టయి పోలీసు కస్టడీలో ఉన్న దిశ రవికి సంబంధించిన వెబ్‌సైట్‌. ఫ్రైడేస్‌ ఫర్‌ ఫ్యూచర్‌’’ఇండియా చాప్టర్‌కి దిశరవి సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. ఖలిస్తానీ సానుభూతి పరులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు వీరిని అరెస్టు చేసిన విషయం తెలిసందే.  

ఏమిటీ ఎఫ్‌ఎఫ్‌ఎఫ్‌ ? 
అసలింతకీ ఏమిటీ ఎఫ్‌ఎఫ్‌ఎఫ్‌? ఎఫ్‌ఎఫ్‌ఎఫ్‌ ఇండియా అనేది∙పర్యావరణ పరిరక్షణా సంస్థ. ఇది ప్రాజెక్టులకు అనుమతులు తదితరాలపైనా, పర్యావరణ సమస్యలపైనా, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇచ్చే నోటిఫికేషన్లపైనా ఈమెయిల్‌ క్యాంపెయిన్‌ చేస్తుంది. 

మతవిద్వేష అంశాలు..     
అయితే ఎఫ్‌ఎఫ్‌ఎఫ్‌ ఇండియా వెబ్‌సైట్‌ ‘‘భారత సార్వభౌమాధికారానికి, శాంతికి, ప్రశాంతతకు, ప్రమాదకరంగా మారింది’’అని ఢిల్లీ పోలీసులు జూలై8, 2020న వెబ్‌సైట్‌ బాధ్యులకు నోటీసులు జారీ చేశారు. అలాగే వెబ్‌సైట్‌లో ‘‘మతపరమైన విద్వేషపూరిత అంశాలు, మెటీరియల్‌’’ఉన్నదని, ఇది సెక్షన్‌ 18 ప్రకారం(తీవ్ర వాద చర్యకు ఉసిగొల్పేదిగా, లేదా అందుకు కుట్రపన్నేదిగా)ఉన్నదని, ఇది అన్‌లాఫుల్‌ యాక్టివిటీస్‌ (ప్రివెన్షన్‌) యాక్ట్‌(యుఏపీఏ)కిందకి వస్తుందని పోలీసులు హెచ్చరించారు. అయితే ఆ తరువాత వెంటనే ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఎఫ్‌ఎఫ్‌ వెబ్‌సైట్‌ని తిరిగి తెరిచేందుకు అనుమతించారు. ఆ తరువాతి రోజు నుంచి వెబ్‌సైట్‌ తిరిగి ఆరంభించారు. అయితే అప్పటి నుంచి ఆ వెబ్‌సైట్‌పై పోలీసులు ఓ కన్నేసి ఉంచారు.  

ఫ్రైడేస్‌ ఫర్‌ ఫ్యూచర్‌
ఎఫ్‌ఎఫ్‌ఎఫ్‌ ఫ్రైడేస్‌ ఫర్‌ ఫ్యూచర్‌ అని అర్థం. అంటే మన భవిష్యత్తు కోసం శుక్రవారాన్ని కేటాయించండి అని. ప్రభుత్వాల చైతన్యం కోసం శుక్రవారాన్ని కేటాయించండి అన అర్థం. ప్రభుత్వ వర్గాల్లో పర్యావరణ చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు ప్రతి శుక్రవారం విద్యార్థులు నిరసన తెలిపే లక్ష్యంతో స్వీడన్‌కి చెందిన పర్యావరణ ఉద్యమకారణి గ్రేటాథన్‌బర్గ్‌ 2018లో ఎఫ్‌ఎఫ్‌ఎఫ్‌ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ తరువాత ఏడాదికి ఎఫ్‌ఎఫ్‌ఎఫ్‌ ఇండియా చాప్టర్‌ని స్థాపించారు. ప్రస్తుతం ఇది దేశంలోని పలు నగరాల్లో ఉంది. దేశవ్యాప్తంగా 150 మంది పూర్తిస్థాయి పర్యావరణ కార్యకర్తలు ఇందులో పనిచేస్తున్నారు. ఇతర దేశాల్లోని ఏకీభావం ఉన్న పర్యావరణ పరిరక్షణా సంస్థలతో కలిసి ఎఫ్‌ఎఫ్‌ఎఫ్‌ పనిచేస్తుంది.  

అటవీ సంరక్షణకోసం ప్రచారోద్యమం 
గోవాలోని మొల్లెం అటవీప్రాంత పరిరక్షణ, జమ్మూలోని రైకా ఫారెస్ట్‌ పరిరక్షణోద్యమం, మధ్య ప్రదేశ్‌లోని దుమ్నా నేచర్‌ పార్క్‌ల పరిరక్షణలు ఈ పర్యావరణ సంస్థ చేపట్టిన ప్రచారకార్యక్రమాల్లో ప్రధానమైనవి. అరే కాలనీలో మెట్రో ప్రాజెక్టుకోసం వేలాది చెట్లను నరికివేస్తున్నప్పుడు 2019, అక్టోబర్‌లో, ఎఫ్‌ఎఫ్‌ఎఫ్‌ కార్యకర్తలకీ పోలీసులకీ మధ్య ఘర్షణ తలెత్తడంతో ఎఫ్‌ఎఫ్‌ఎఫ్‌కార్యకర్తలను కొందరిని అరెస్టు చేశారు.  

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచ ప్రజల ఉద్యమం 
‘‘పర్యావరణ న్యాయం కోసం ప్రపంచ ప్రజల ఉద్యమం’’(గ్లోబల్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ ఫర్‌ క్లైమేట్‌ జస్టిస్‌) అనే నినాదంతో తమ వెబ్‌సైట్‌ లక్ష్యాన్ని ఈ ఎఫ్‌ఎఫ్‌ఎఫ్‌ సంస్థ సుస్పష్టంగా వెబ్‌సైట్‌లో ఉంచింది. ‘‘సమగ్ర, పర్యావరణ సమతుల్యత కోసం నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా ఉద్యమం నిర్వహిస్తామని, పర్యవారణ సమతుల్యత కోసం అహింసా మార్గంలో క్లైమేట్‌ స్ట్రయిక్, లేదా శాంతియుత ప్రదర్శనలు నిర్వహిస్తామని, తద్వారా రాష్ట్రప్రభుత్వాలు పర్యావరణ సంక్షోభాన్ని నిలువరించే చర్యలు చేపట్టేలా ఎఫ్‌ఎఫ్‌ఎఫ్‌ ఇండియా కృషి చేస్తుందని ఈ సంస్థ తన వెబ్‌సైట్‌లో స్పష్టం చేసింది.   

కుట్రదారులంటోన్న పోలీసులు 
ఏది ఏమైనా, దిశ, నికితా జాకబ్, శాంతాను ములుక్‌ లు రైతుల ఆందోళనకు మద్దతు పలికే గ్రేటాథన్‌ బర్గ్‌ టూల్‌కిట్‌ ని ట్వీట్‌ చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రైతుల ఆందోళనను అవకాశంగా తీసుకొని భారత దేశాన్ని అస్థిరపరిచే ‘అంతర్జాతీయ కుట్ర’గా దీన్ని పోలీసులు అభివర్ణిస్తున్నారు.  

గ్లోబల్‌ క్లైమేట్‌ స్ట్రయిక్‌  
2019 సెప్టెంబర్‌లో ఫ్రైడేస్‌ ఫర్‌ ఫ్యూచర్‌ సంస్థ వాతావరణ మార్పులపై గ్లోబల్‌ క్లైమేట్‌ స్ట్రయిక్‌ కార్యక్రమంలో భాగంగా భారత్‌లో సైతం పలు ప్రదర్శనలు నిర్వహించింది. మొదట పర్యావరణ పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా ప్రారంభమైన ఈ సంస్థకు చెందిన కార్యకర్తలు అనంతరం ఇతర సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్, ఎన్‌ఆర్‌సీ ఉద్యమాల్లో ఎఫ్‌ఎఫ్‌ఎఫ్‌ కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతోన్న రైతు ఆందోళనకి సైతం తమ మద్దతు తెలిపారు. అయితే వీరి ప్రథాన లక్ష్యం మాత్రం పర్యావరణ పరిరక్షణే. వీరంతా వాతావరణ మార్పులపై చైతన్యం తీసుకొచ్చే ప్రచార కార్యక్రమాల్లో భాగమై ఉంటారు. అందులో భాగంగా వీరు సరస్సులను శుభ్రపరచడం, పార్కులను పరిశుభ్రం చేయడం, సమస్యాత్మకంగా మారిన పర్యావరణ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తారు.

చదవండి: #AT21: ఆ వయసులో నేను..
చదవండి: దిశ రవి అరెస్టుపై స్పందించిన ఆమె స్నేహితుడు

>
మరిన్ని వార్తలు