టూల్‌కిట్‌ కేసు: ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

19 Feb, 2021 16:03 IST|Sakshi

దర్యాప్తు సమయంలో సమాచారం లీక్‌ చేయకూడదంటూ పోలీసులకు సూచన

మీడియా తీరుపై ఢిల్లీ హై కోర్టు ఆగ్రహం

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న టూల్‌కిట్‌ కేసుకు సంబంధించి దిశ రవి దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా ఢిల్లీ హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘టూల్‌కిట్‌ కేసు దర్యాప్తులో భాగంగా.. ఢిల్లీ పోలీసులు మీడియాకు ఎలాంటి సమాచారం లీక్‌ చేయలేదు’’ అనే అంశానికి కట్టుబడి ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. ‘‘టూల్‌కిట్‌ కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ పోలీసులు, మీడియా హౌస్‌లు తన వ్యక్తిగత వాట్సాప్‌ చాట్‌లను బహిర్గతం చేశారు. ఇక మీదట ఇలా జరగకుండా పోలీసులను ఆదేశించండి’’ అంటూ దిశ రవి ఢిల్లీ హై కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది.

ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా శుక్రవారం ఢిల్లీ హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులు, మీడియా అత్యుత్సాహం వల్ల పిటిషనర్ గోప్యత హక్కు, కీర్తి హక్కు, న్యాయమైన విచారణ హక్కులకు తీవ్రమైన భంగం వాటిల్లినట్లు కోర్టు అభిప్రాయపడింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఒక జర్నలిస్టును వారి సోర్స్‌ గురించి వెల్లడించమని ఎలా ఒత్తిడి చేయలేమో.. దర్యాప్తు కొనసాగుతున్న కేసు విషయంలో కూడా ఇలాగే ఉండాలి. టూల్‌కిట్‌ కేసులో పోలీసులు తాము ఎలాంటి సమాచారం లీక్‌ చేయలేదని చెబుతుండగా.. మీడియాలో ఇందుకు విరుద్ధమైన కథనాలు ప్రసారం అవుతున్నాయి’’ అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

టూల్‌కిట్‌ కేసు దర్యాప్తు కొనసాగుతున్నందున.. దీనికి సంబంధించి పోలీసులు మీడియాకు ఎలాంటి సమాచారం లీక్‌ చేయవద్దని ఢిల్లీ హై కోర్టు ఆదేశించింది. దర్యాప్తు కొనసాగుతుండగానే.. దాని గురించి సగంసగం, ఊహాజనిత సమాచారం ప్రచారం చేయబడుతోంది అని దిశ రవి తరఫు న్యాయవాది అఖిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. "గోప్యత హక్కు, దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, వాక్‌ స్వాతంత్ర హక్కుల మధ్య సమతుల్యత అవసరం. ఇటీవలి టూల్‌కేట్‌ కేసుకు సంబంధించి ప్రసారమైన కథనాలు చూస్తే.. ఖచ్చితంగా మీడియా సంచలనాత్మక రిపోర్టింగ్ చేసిందని అర్థం అవుతోంది. ఏదైనా అంశం గురించి మీడియా సమావేశాలు జరగడం సాధారంణం. అలాంటి సమయంలో మీడియా సంచలనాత్మమైన పద్దతిలో సమాచారాన్ని వ్యాప్తి చేయడం తగదు’’ అని కోర్టు అభిప్రాయ పడింది. 

"దర్యాప్తుకు ఆటంకం కలగకుండా సమాచారాన్ని ప్రసారం చేసే సమయంలో  సరైన సంపాదకీయ నియంత్రణ ఉండేలా చూసుకోండి" అని కోర్టు న్యూస్ ఛానెల్స్‌కు సూచించింది. "ప్రతివాదులు అందరికీ వివరణాత్మక సమాధానాలు దాఖలు చేయడానికి సమయం అవసరం" అని కోర్టు తెలిపింది. ఈ సందర్భంగా అదనపు సొలిసిటర్ జనరల్ (ఎ.ఎస్.జి) సూర్యప్రకాష్‌ వీ రాజు దీనిపై మాట్లాడుతూ.. ‘‘దిశ రవి పోలీసులపై ఒత్తిడి తెవడమే కాక వారిని అపఖ్యాతి పాలు చేస్తున్నారు.. దర్యాప్తును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇటువంటి పిటిషన్‌ దాఖలు చేశారు’’ అని ఆరోపించారు. 

చదవండి: అణచేస్తే అణగని జనగళం

మరిన్ని వార్తలు