అణచివేత శకం ముగియాలి: ముఫ్తీ

28 Jun, 2021 05:13 IST|Sakshi

అప్పుడే సంప్రదింపుల ప్రక్రియకు విశ్వసనీయత 

అసమ్మతి స్వరం వినిపించడం నేరం కాదు 

ప్రత్యేక ప్రతిపత్తి పునరుద్ధరించే దాకా ఎన్నికల్లో పోటీ చేయను 

జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం, పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో అణచివేత శకానికి ముగింపు పలికితేనే ఇక్కడి ప్రధాన రాజకీయ పార్టీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన సంప్రదింపులు ప్రక్రియకు విశ్వసనీయత ఉంటుందని పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ (పీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ (62) తేల్చిచెప్పారు. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా అసమ్మతి గళం వినిపించడం నేరమేమీ కాదని.. దీన్ని అర్థం చేసుకోవాలని హితవు పలికారు. ఆమె తాజాగా ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. ప్రజలకు ఊపిరిపీల్చే హక్కు ఉండాలని, ఆ తర్వాతే ఏదైనా అని వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్‌ ప్రజలు ఎన్నో బాధలు ఎదుర్కొంటున్నారని అన్నారు. 14 మంది నేతల బృందంతో గురువారం ప్రధాని మోదీ నిర్వహించిన భేటీతో ఈ బాధల ఉపశమనానికి ఒక మార్గం ఏర్పడిందని భావిస్తున్నట్లు చెప్పారు. మెహబూబా ముఫ్తీ ఇంకా ఏం మాట్లాడారంటే...  

ఉద్యోగాలు, భూములపై హక్కులను కాపాడాలి  
‘‘జమ్మూకశ్మీర్‌ పార్టీల నాయకులతో చర్చల ప్రక్రియకు విశ్వసనీయత అనేది కేంద్రం పరిధిలోనే ఉంది. ప్రజల్లో విశ్వాసాన్ని పాదుకొల్పే చర్యలను ప్రారంభించాలి. జమ్మూకశ్మీర్‌ వాసులను ఊపిరి పీల్చుకోనివ్వాలి. వారి ఉద్యోగాలను, వారి భూములపై హక్కులను కాపాడాలి. ఊపిరి పీల్చుకోనివ్వండి అనడంలో నా ఉద్దేశం ఏమిటంటే.. ప్రభుత్వానికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే చాలు జైల్లో విసిరేస్తున్నారు. ఇటీవలే తన మనోభావాలను వ్యక్తం చేసిన ఓ పౌరుడిని జైల్లో పెట్టారు. కోర్టు అతడికి బెయిల్‌ మంజూరు చేసినప్పటికీ అధికారులు జైలు నుంచి విడుదల చేయలేదు. మరోవైపు ప్రధానమంత్రి మోదీ మాత్రం దిల్‌ కీ దూరీ.. దిల్లీ కీ దూరీ (హృదయాల మధ్య దూరం.. ఢిల్లీతో అంతరం) అంతం కావాలని కోరుకుంటున్నానని చెబుతున్నారు. అంతకంటే ముందు జమ్మూకశ్మీర్‌ ప్రజలపై అణచివేతను అంతం చేయండి. ప్రజలకు వ్యతిరేకంగా క్రూరమైన ఉత్తర్వులు జారీ చేయడం వెంటనే నిలిపివేయాలి.

రాష్ట్రం ఒక జైలుగా మారింది  
జమ్మూకశ్మీర్‌ను నేను ఒక రాష్ట్రంగానే పరిగణిస్తా. ఈ మొత్తం రాష్ట్రం ఇప్పుడొక జైలుగా మారిపోవడం దారుణం. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాలి. జమ్మూకశ్మీర్‌తోపాటు లద్దాఖ్‌లో పర్యాటకం, వ్యాపార రంగాల్లో ఉన్నవారు ఆర్థికంగా నష్టపోయారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలి, తగిన సాయం అందించాలి. ప్రజల కష్టాల పట్ల ప్రభుత్వ ప్రతిస్పందనను అంచనా వేయడానికే ఢిల్లీలో ప్రధాని మోదీతో జరిగిన చర్చల్లో పాల్గొన్నా. పవర్‌ పాలిటిక్స్‌ కోసం వెళ్లలేదు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించే దాకా ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయనని గతంలోనే చెప్పా. అదే మాటకు కట్టుబడి ఉన్నా.

ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూకశ్మీర్‌ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టనష్టాలను అందరి దృష్టికి తీసుకెళ్లడానికి ప్రధానితో జరిగిన భేటీని ఒక అవకాశంగా భావించా. జమ్మూకశ్మీర్‌ కేంద్ర పాలిత ప్రాంతంగానే కొనసాగితే ఎన్నికల్లో నేను పోటీ చేసే ప్రసక్తే లేదు. అదే సమయంలో రాజకీయంగా లాభపడే అవకాశాన్ని మరొకరికి ఇవ్వడం మాకు ఇష్టం లేదు. అందుకే గత ఏడాది జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికల్లో గుప్కర్‌ కూటమితో కలిసి మా పార్టీ పోటీ చేసింది. ఒకవేళ అసెంబ్లీ ఎన్నికలను ప్రకటిస్తే కలిసి కూర్చొని, చర్చించుకొని, నిర్ణయం తీసుకుంటాం’’అని మెహబూబా ముఫ్తీ తెలిపారు.

మరిన్ని వార్తలు