భార్యకు విడాకులివ్వొచ్చు.. కానీ పిల్లలకు విడాకులివ్వలేవు! 

18 Aug, 2021 04:15 IST|Sakshi

విడాకుల కేసులో సుప్రీం వ్యాఖ్య

న్యూఢిల్లీ: ఒక వ్యక్తి తన భార్యకు విడాకులివ్వడం కుదురుతుంది కానీ, పుట్టిన పిల్లలకు విడాకులివ్వడం కుదరదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఒక విడాకుల కేసులో సెటిల్‌మెంట్‌ కోసం ఆరువారాల్లో రూ.4కోట్లు చెల్లించాలని భర్తను ఆదేశించింది. అధికరణ 142 ప్రకారం తనకు సంక్రమించిన అధికారాలతో సదరు వ్యక్తికి, ఆయన భార్యకు పరస్పర అంగీకారంపై విడాకులు మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. పిల్లల బాధ్యత తండ్రిపై ఉంటుందని, అందువల్ల విడాకులిచ్చినా పిల్లల భవితవ్యం కోసం భార్యకు తగిన మొత్తం చెల్లించాలని జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌ ఆదేశించింది.

ఆభరణాల వ్యాపారంలో ఉన్న తన క్లయింట్‌ ఆర్థిక పరిస్థితి కరోనా కారణంగా దెబ్బతిన్నదని, దివాలా తీసే స్థితి ఉందని, అందువల్ల సెటిల్‌మెంట్‌కు ఒప్పుకున్న మొత్తాన్నివ్వడానికి మూడునెలలైనా ఇవ్వాలని భర్త  తరఫు న్యాయవాది కోరారు.  ఈ అభ్యర్ధనను పాక్షికంగా మన్నించిన కోర్టు వచ్చేనెల 1నాటికి ఒక కోటి రూపాయలు చెల్లించాలని, సెప్టెంబర్‌ ఆఖరుకు మిగిలిన మూడు కోట్ల రూపాయలివ్వాలని ఆదేశించింది.

2019లోనే ఇరువురి మధ్య విడిపోవడానికి సంబంధించి ఒప్పందం కుదిరిందని, అప్పటికి కరోనా ఆరంభం కాలేదని గుర్తు చేసింది. నిజానికి 2019లోనే సదరు భర్త ఒప్పుకున్న మొత్తాన్ని ఇచ్చిఉండాల్సిందని వ్యాఖ్యానించింది. విడాకులు మంజూరు చేసిన దృష్ట్యా ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు పెట్టుకున్న కేసులను కొట్టివేస్తున్నట్లు తెలిపింది. విడిపోతున్న దంపతులకున్న బాబు, పాప బాధ్యతలకు సంబంధించి ఇరుపక్షాలు కుదుర్చుకున్న ఒప్పంద నియమాలను గౌరవించాలని సూచించింది.    

>
మరిన్ని వార్తలు