సీఎం ‘అక్రమ సంతానం’ వ్యాఖ్యలపై రాజా క్షమాపణ

29 Mar, 2021 15:09 IST|Sakshi

చెన్నె: అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడులో వ్యక్తిగత దూషణలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ, డీఎంకే నాయకుడు ఎ.రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం పళనిస్వామి, డీఎంకే అధినేత స్టాలిన్‌పై అక్రమ సంబంధం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. తాజాగా ఆ వ్యాఖ్యలపై రాజా మళ్లీ స్పందించారు. ఆ వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు కోరారు. తాను చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాపం పడుతున్నట్లు రాజా ప్రకటించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా చెపాక్‌లో ఇటీవల జరిగిన ప్రచార కార్యక్రమంలో రాజా మాట్లాడుతూ సీఎం పళని స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అక్రమ సంబంధ జంటకు పళనిస్వామి జన్మించారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రీమెచ్చుర్‌గా పళని పుట్టాడని, ఢిల్లీకి చెందిన డాక్టర్‌ నరేంద్ర మోదీ హెల్త్‌ సర్టిఫికెట్‌ ఇచ్చారని తెలిపారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అన్నాడీఎంకే వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేయగా ఈ వ్యాఖ్యలపై సీఎం పళని ఆదివారం స్పందించారు. తన తల్లిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై భావోద్వేగానికి గురయ్యారు. దేవుడు వారిని శిక్షిస్తారని ప్రచార సభలో పేర్కొన్నారు. అనంతరం సోమవారం ఏ.రాజ ఆ వ్యాఖ్యలపై స్పందించారు. 

‘నా వ్యాఖ్యల ఉద్దేశం వ్యక్తిగతం కాదు. రాజకీయంగా మాత్రమే విమర్శలు చేశా’ అని రాజా వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా క్షమాపణలు ప్రకటించారు. అయితే ఆ వ్యాఖ్యలు చేసినందుకు అన్నాడీఎంకే నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు కూడా నమోదైంది. దీంతోపాటు ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: సీఎంని స్టాలిన్‌ చెప్పుతో పోల్చిన నాయకుడు

మరిన్ని వార్తలు