బీజేపీలోని నటీమణులంతా ‘ఐటమ్‌’లు.. డీఎంకే నేత వ్యాఖ్యల దుమారం

28 Oct, 2022 14:39 IST|Sakshi

సాక్షి, చెన్నై: బీజేపీ నేతలుగా మారిన పలువురు నటీమణులపై డీఎంకే నేత సాధైయ్‌ సాధిక్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తమిళనాడు బీజేపీలో ఉన్న సీనియర్‌ నటీమణులు ఖుష్బు, నమితా, గౌతమి, గాయత్రి రఘురామన్‌లు ‘ఐటమ్‌’లు అంటూ వ్యాఖ్యానించారు. ఆర్కే నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. బీజేపీలో మహిళ నేతలుగా  ఉన్న నలుగురు నటీమణులు పెద్ద ఐటమ్‌లు అంటూ వ్యాఖ్యలు చేశారు.

‘తమిళనాడులో బీజేపీ బలపడుతుందని ఖుష్బూ చెబుతోంది. అమిత్‌షా తలపై వెంట్రుకలైనా మొలుస్తాయోమో కానీ తమిళనాడులో బీజేపీ మాత్రం వికసించదు. డీఎంకేను నాశనం చేసి బీజేపీని బలోపేతం చేసేందుకు వీళ్లు (వేశ్యలు) ఉపయోగపడతారా?. వారి వల్ల కాదు. నా సోదరుడు ఇళయ అరుణ కుష్బుతో ఎన్నోసార్లు కలిశాడు. అంటే నా ఉద్ధేశం ఆమె డీఎంకేలో ఉన్నప్పుడు ఆమెతో దాదాపు ఆరుసార్లు సమావేశాల్లో పాల్గొన్నారు.’ అంటూ విపరీత అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

డీఎంకే చేసిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ నాయకురాలు ఖుష్భూ తీవ్రంగా ఖండించారు. ‘పురుషులు స్త్రీలను దుర్భాషలాడటం, అది వారి పెంపకం, వారు పెరిగిన విషపూరిత వాతావరణాన్ని  అందరికీ తెలిసేలా చేస్తుంది. ఈ పురుషులు స్త్రీ గర్భాన్ని అవమానిస్తారు. అలాంటి పురుషులు  తాము కళైజ్ఞర్ అనుచరులుగా చెప్పుకుంటారు. ఇదేనా సీఎం ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో కొత్త ద్రావిడ నమూనా పాలన’ అంటూ ట్విటర్‌ వేదికగా సాధిక్‌ వ్యాఖ్యలను ఎండగడుతూ డీఎంకే మహిళా విభాగం కార్యదర్శి, ఎంపీ కనిమొళిని ట్యాగ్‌ చేశారు.

దీనిపై స్పందించిన డీఎంకే నేత కనిమొళీ ఖుష్బూకి క్షమాపణలు తెలియజేశారు. మహిళలను కించపరుస్తూ తమ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఓ మనిషిగా, మహిళగా బహిరంగ క్షమాపణ చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేసిన వారు ఎవరైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ పార్టీ వారైనా వాటిని సహించలేమన్నారు. తమ నాయకుడు సీఎం స్టాలిన్‌గానీ, పార్టీ అధిష్టానంగానీ ఇలాంటి చర్యలను ఉపేక్షించబోరని స్పష్టం చేశారు. 

అనంతరం సాధిక్‌ సైతం తన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరారు. ఎవరిని కించపరచడం తమ ఉద్ధేశం కాదని వెల్లడించారు. అయితే బీజేపీ అధిష్టానం చేసిన వ్యాఖ్యలపై మాత్రం ఎవరూ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై.. డీఎంకే మంత్రులను పందులు, జంతువులు అంటూ మాట్లాడారని, . జర్నలిస్టులను కోతులతో పోల్చాడని..  బీజేపీ నేతలు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు