డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌కు అస్వస్థత

12 Dec, 2020 07:56 IST|Sakshi

బీపీ పెరగడంతో మైకం

టోల్‌గేట్లు తొలగించాలని డీఎంకే ఆందోళన 

సాక్షి, చెన్నై : డీఎంకే అధ్యక్షులు స్టాలిన్‌ శుక్రవారం అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. గంట తరువాత కోలుకుని మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లారు. తాను ప్రాతి నిథ్యం వహిస్తున్న కొలత్తూరులో సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు జరిగాయి. తుపాన్, భారీ వర్షాలకు నష్టపోయిన వారికి స్టాలిన్‌ సహాయకాలు పంచి పెడుతుండగా అకస్మాత్తుగా మైకం వచ్చి పడిపోయారు. దీంతో పార్టీ శ్రేణులు వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. బీపీ ఎక్కువైనందున మైకం కమ్మిందని వైద్యులు తెలిపారు. ప్రా«థమిక చికిత్స అనంతరం కొద్దిసేపటి తరువాత కోలుకున్నారు. అక్కడి నుంచి  కుటుంబవైద్యులతో పోరూరులోని శ్రీరామచంద్ర ఆస్పత్రికి వెళ్లారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని ఆందోళన చెందాల్సిన అవసరంలేదని మీడియా ద్వారా స్టాలిన్‌ పార్టీ శ్రేణులకు తెలిపారు.

డీఎంకే ఆందోళన: 
చట్టవిరుద్ధంగా కొనసాగుతున్న టోల్‌గేట్లను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ డీఎంకే శ్రేణులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. చెన్నై షోళింగనల్లూరులో నిరసన సభ నిర్వహించారు. చెన్నై కార్పొరేషన్‌ సరిహద్దులో పది కిలోమీటర్ల తరువాత మాత్రమే టోల్‌గేట్లు ఉండాలని చట్టం ఉంది. కేంద్రప్రభుత్వ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం షోళింగనల్లూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పెరుంగుడి, తరైపాక్కం 200 అడుగుల రోడ్డు, షోళింగనల్లూరులోని కరుణానిధిరోడ్డు ప్రాంతాల్లో టోల్‌గేట్లను నిర్వహిస్తున్నట్లు డీఎంకే ఆరోపిస్తోంది. టోల్‌గేట్లను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ డీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ అగ్రనేతలు కొంతకాలంగా ఒత్తిడి చేస్తున్నారు. ఇదే డిమాండ్‌పై శుక్రవారం ఉదయం 10 గంటలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పార్టీ కార్యకర్తలతో కలిసి షోళింగనల్లూరులో ఆందోళనకు దిగారు.      

మరిన్ని వార్తలు