హిందువుగా ఉన్నంత వరకూ.. డీఎంకే రాజా వ్యాఖ్యల దుమారం

14 Sep, 2022 13:52 IST|Sakshi

చెన్నై: ‘‘హిందువుగా ఉన్నంత వరకూ నువ్వు దళితునివే. అంటరానివాడివే. శూద్రునివే. శూద్రునిగా ఉన్నంతకాలం నువ్వు ఓ వేశ్య సంతానమే’’అంటూ డీఎంకే నేత, కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మంగళవారం చెన్నైలో పార్టీ భేటీలో ఆయన మాట్లాడుతూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

‘‘మీలో ఎంతమంది వేశ్య సంతానంగా, అంటరానివారిగా మిగిలిపోవాలనుకుంటున్నారు? ఈ ప్రశ్నలపై గొంతెత్తినప్పుడు మాత్రమే సనాతన ధర్మాన్ని బద్దలుకొట్టే ఆయుధంగా మారగలం’’అంటూ పిలుపునిచ్చారు. ‘‘శూద్రులంటే హిందువులు కారా? వారిని మను స్మృతి తీవ్రంగా అవమానించింది. వారికి విద్య, ఉద్యోగ, సమానావకాశాలను, ఆలయాల్లోకి ప్రవేశాలను నిషేధించింది’  అంటూ రాజా ప్రసంగించినట్టుగా చెబుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

ద్రవిడ ఉద్యమం 90 శాతం మంది హిందువులకు బాసటగా నిలిచిందంటూ అనంతరం రాజా ఓ ట్వీట్‌ కూడా చేశారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది.

ఇదీ చదవండి: బీజేపీ బలవంతంగా రుద్దాలని చూస్తే ఊరుకోం

మరిన్ని వార్తలు