నా పుట్టినరోజు  వేడుకలు చేయకండి

27 Jul, 2021 04:36 IST|Sakshi

పార్టీ కార్యకర్తలు, అభిమానులను కోరిన ఉద్ధవ్‌ ఠాక్రే 

ఖర్చు చేసే డబ్బును సీఎంఆర్‌ఎఫ్‌కు పంపాలని విజ్ఞప్తి 

సాక్షి, ముంబై: రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించవద్దని పార్టీ పదాధికారులు, కార్యకర్తలు, అభిమానులకు శివసేన అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే విజ్ఞప్తి చేశారు. ప్రతీ ఏడాది ఉద్ధవ్‌ ఠాక్రే పుట్టిన రోజు అయిన జూలై 27వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా కేక్‌ కట్‌ చేసి సÜంబరాలు చేసుకుంటారు. కానీ, గత కొంతకాలంగా రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. కరోనా రెండో వేవ్‌ ఇంకా పూర్తిగా సద్దుమణుగక ముందే మూడో వేవ్‌ వచ్చే ప్రమాదమూ ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా కబంధ హస్తాల నుంచి ఇంకా బయటపడక ముందే ప్రకృతి కన్నెర్ర చేసింది.

రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అనేక జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ముఖ్యంగా ఆరు జిల్లాల్లో వరదలు వచ్చి పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. భారీ వర్షాలకు వందలాది గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. చాలాచోట్ల విద్యుత్, తాగు నీటి సరఫరా నిలిచిపోయింది. బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కొండచరియలు విరిగిపడి అనేక మంది మృతిచెందారు. ఇలాంటి విపత్కర సమయంలో తాను సంతోషంగా ఎలా ఉండగలనని, పుట్టిన రోజు వేడుకలు ఎలా చేసుకుంటానని ఉద్ధవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తాను వేడుకలు చేసుకోవడం లేదని, కార్యకర్తలు, అభిమానులు కూడా వేడుకలు నిర్వహించకూడదని కోరారు. అంతేగాక, తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఎవరూ ముంబైకి రావద్దని ఉద్ధవ్‌ విజ్ఞప్తి చేశారు.

ముంబై, ఇతర నగరాలతో పాటు జిల్లాల్లో, గ్రామాల్లో రహదారులపై, ప్రధాన కూడళ్ల వద్ద పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసే పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, ప్రవేశ ద్వారాలు, కటౌట్లు ఏర్పాటు చేయవద్దని సూచించారు. కేవలం ఈ–మెయిల్, ఇతర సోషల్‌ మీడియా ద్వారా పంపించే శుభాకాంక్షలు మాత్రమే స్వీకరిస్తానని ఉద్ధవ్‌ తెలిపారు. ప్రభుత్వం అమలుచేస్తున్న లాక్‌డౌన్‌ నిబంధనలను పాటిస్తూ అందరూ ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి బహిరంగ కార్యక్రమాలు ఏర్పాటు చేయవద్దని సూచించారు. అనవసరంగా వేడుకల కోసం డబ్బులు వృథా చేయకుండా, వరద బాధితుల కోసం నిధులు పోగుచేసి ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌)కి పంపించాలని కోరారు. ఇదే తన పుట్టిన రోజుకు కార్యకర్తలు, అభిమానులు ఇచ్చే కానుక అని ఉద్ధవ్‌ ఉద్ఘాటించారు.

మరిన్ని వార్తలు