పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డ భారత్‌

1 Oct, 2020 18:47 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి(యూఎన్‌హెచ్‌ఆర్‌సీ)లో దాయాది దేశం పాకిస్తాన్‌పై భారత్‌ విరుచుకుపడింది. ఓ వైపు ఉగ్రవాదాన్ని ప్రోత్సాహిస్తూనే.. మరోవైపు బాధితురాలిగా బిల్డప్‌ ఇస్తూ అంతర్జాతీయ సమాజం దృష్టిని మరల్చే ప్రయత్నం చేయవద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. జెనీవాలో ఐక్యరాజ్య సమితికి భారత మొదటి కార్యదర్శి విమర్ష్ ఆర్యన్ మాట్లాడుతూ.. ‘ఉగ్రవాదంపై చర్చ జరిగినప్పుడల్లా పాకిస్తాన్‌ తాను బాధితురాలిని అంటూ మొసలి కన్నీరు కారుస్తుంది. కానీ మరోవైపు ఐక్యరాజ్యసమితి నిషేధించిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తోంది. అయితే ఈ వాస్తవం నుంచి అంతర్జాతీయ సమాజ దృష్టిని మరల్చడానికి ఇలా నాటకాలు ఆడుతుంది’ అంటూ విమర్శించారు. అంతేకాక భారతదేశంలో మైనారిటీలకు రక్షణ కరువు అవుతుంది అంటూ పాక్‌ చేసిన వ్యాఖ్యలపై కూడా ఆర్యన్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దాయాది దేశం మహిళలు, పిల్లలు, హిందువులు, జర్నలిస్ట్‌ల విషయంలో ఎంత క్రూరంగా వ్యవహరిస్తుందో ఉదాహరణలతో సహా వెల్లడించారు. (చదవండి: బాబ్రీ విధ్వంసం వెనక పాక్‌ హస్తం!)

ఆసిఫ్ పెర్వైజ్ అనే క్రైస్తవ వ్యక్తికి మరణ శిక్ష విధించడం.. దక్షిణ ప్రావిన్స్‌ సింధ్‌లో హిందూ మహిణ పార్యా కుమారిని అపహరించి మతం మార్చడం.. బిలాల్‌ ఫారూకి వంటి నిజాయతీ కలిగిన జర్నలిస్ట్‌ని పాక్‌ సైన్యం తీవ్రంగా హింసించడం వంటి ఉదాహరణలను వెల్లడించారు ఆర్యన్‌. ఇంత క్రూరంగా ప్రవర్తించే పాకిస్తాన్‌, భారత్‌ వంటి ప్రజాస్వామ్య దేశానికి హితబోధ చేయడం.. ఇండియాలో మైనారిటీల గురించి ఆందోళన వ్యక్తం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. భారత దేశాన్ని అప్రదిష్ట పాలు చేయడం కోసం ఎన్ని కల్పిత కథలు చెప్పినా.. పాక్‌ నుంచి ప్రాణ భయంతో పారిపోతున్న మైనారిటీలు వాస్తవాన్ని కళ్లకు కడుతున్నారని.. దీన్ని అంతర్జాతీయ వేదికలు మార్చబోవని ఆర్యన్‌ స్పష్టం చేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు