పనిచేసే చోట పదిలమేనా? ఆఫీసుల్లో కానరాని ఫిర్యాదుల సమితులు

16 Jun, 2022 17:16 IST|Sakshi

బెంగళూరు: ఆమె ఓ ఆఫీసులో ఉద్యోగి. అందులో ఓ పురుష ఉద్యోగి పోకిరీ చేష్టలతో సమస్యగా ఉంటోంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే రచ్చ అవుతుంది. ఆఫీసులో పై అధికారులకు చెప్పుకుందామంటే అవకాశం ఉండదు. ఇలా.. ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులు, కంపెనీల్లో మహిళా ఉద్యోగులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే బాధితులు ఫిర్యాదు చేయడానికి అంతర్గత ఫిర్యాదుల సమితి (ఐసీసీ) ఉండాలి. కానీ ఈ కమిటీలు అనేక చోట్ల మనుగడలో లేవు. దీంతో మహిళలు గోడు చెప్పుకోవడానికి అవకాశం దొరకడం లేదు. రాష్ట్ర మహిళా కమిషన్‌ సమీక్షలో ఈ చేదునిజం వెలుగుచూసింది. రాష్ట్రంలో అన్ని ప్రైవేటు సంస్థల్లో కమిషన్‌ సర్వే చేయగా, 5,550 ఆఫీసులు, సంస్థల్లో ఐసీసీలు లేవని తేలింది.  

ఐసీసీ ఎలా ఉండాలి 
ప్రభుత్వ చట్టాల ప్రకారం 10 మంది కంటే ఎక్కువ మంది మహిళాసిబ్బంది పనిచేసేచోట మహిళలపై లైంగిక దాడులు, వేధింపులను నివారణకు తప్పనిసరిగా ఐసీసీ ఉండాలి. సీనియర్‌ ఉద్యోగులతో దీనిని ఏర్పాటు చేయాలి. కమిటీలో తప్పనిసరి మహిళా ఉద్యోగులు, ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధికి చోటివ్వాలి. కనీసం మూడు నెలలకు ఒకసారి సమావేశమై మహిళా ఉద్యోగుల సమస్యల మీద చర్చించాలి. కమిటీ లేనట్లయితే అలాంటి సంస్థపై జరిమానా విధించడం, లైసెన్సు రద్దు చేయడానికీ ఆస్కారముంది.  

ఆ సంస్థలకు హెచ్చరికలు  
ఇప్పటివరకు సుమారు 400 ప్రభుత్వ, 1300కు పైగా ప్రైవేటు సంస్థల్లో ఐసీసీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అయినప్పటికీ 5,550 ప్రైవేటు ఆఫీసుల్లో ఇంకా ఎలాంటి పురోగతి లేదని, ఆ సంస్థలకు హెచ్చరికల జారీ చేశామని మహిళాకమిషన్‌ అధ్యక్షురాలు ప్రమీళానాయుడు తెలిపారు. గత ఏడాదిలో పనిచేసే చోట లైంగిక వేధింపులపై 210 కేసులు నమోదు కాగా, ఇందులో బెంగళూరులోనే ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా గార్మెంట్స్‌ ఫ్యాక్టరీల్లో ఎక్కువగా వేధింపుల సమస్య ఉంది, ఇక్కడ మహిళల  భద్రత కోసం అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆమె తెలిపారు.

(చదవండి: మహిళా రచయిత్రి పై అత్యాచారం...చంపేస్తామంటూ బెదిరింపులు..)

మరిన్ని వార్తలు