వైరల్‌: డాక్టర్‌ చెంప చెళ్లుమనిపించిన నర్సు.. వెంటనే

27 Apr, 2021 11:54 IST|Sakshi

లక్నో: మహమ్మారి కరోనా ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఓవైపు ఆస్పత్రుల్లో బెడ్ల కొరత, మరోవైపు ఆక్సిజన్‌ అందక ప్రజలు ప్రాణాలు విడుస్తున్న విషాద ఘటనలు మానసిక​ స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. అనేక మంది ఫ్రంట్‌లైన్‌ వారియర్లు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వైద్యులు కరోనా కల్లోల పరిస్థితులు చూసి ఉద్వేగానికి లోనవుతూ సోషల్‌ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ప్రస్తుత పరిస్థితుల్లో ఓ డాక్టర్‌, నర్సు ఆస్పత్రిలో ప్రవర్తించిన తీరు విమర్శలకు దారి తీసింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలో ప్రకారం... వైద్యుడికి వద్దకు వచ్చిన నర్సు ఏదో విషయమై ఆయనను నిలదీశారు. 

ఈ క్రమంలో ఇరువురు అసభ్య పదజాలంతో దూషించుకున్నారు. అక్కడ ఉన్న పోలీసు వారిని వారించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇంతలో విచక్షణ కోల్పోయిన సదరు నర్సు.. డాక్టర్‌పై చేయిచేసుకున్నారు. ఈ హఠాత్పరిణామంతో కంగుతిన్న డాక్టర్‌ సైతం వెంటనే స్పందించి, ఆమెను తిరిగి కొట్టారు. కాగా ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ జిల్లా ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటనపై నగర మెజిస్ట్రేట్‌ రాంజీ మిశ్రా ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. ‘‘వారిద్దరితోనూ మాట్లాడాను. తీవ్రమైన ఒత్తిడి, అధిక పనిభారం వల్లే ఇలా చేసినట్లు చెప్పారు. ఏదేమైనా ఘటనపై లోతుగా విచారణ జరిపిస్తాం’’ అని పేర్కొన్నారు. 

ఇక సోమవారం నాటి ఘటనకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కాగా ఓ పేషెంట్‌కు సంబంధించిన మరణ ధ్రువీకరణ పత్రం జారీ అంశమై ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఇక గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3,23,144 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు వెలుగు చూడగా, 2812 కరోనా మరణాలు సంభవించాయి. అయితే, 219272 మంది మహమ్మారి నుంచి కోలుకోవడం కాస్త ఊరటనిచ్చే అంశంగా పరిణమించింది. 


 

మరిన్ని వార్తలు