దారుణం: డాక్టర్‌ నిర్వాకం..ప్రసవ వేదనతో వచ్చిన మహిళ కడుపులో టవల్ ఉంచేసి..

4 Jan, 2023 15:00 IST|Sakshi

ప్రసవ వేదనతో ప్రైవేట్‌ ఆస్పత్రికి వచ్చిన మహిళ కడుపులో టవల్ ఉంచేసి నిర్లక్ష్యంగా ఆపరేషన్‌ చేశాడో వైద్యుడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలోని బాన్స్ ఖేరీ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్లే... నజరానా అనే మహిళ ప్రసవ వేదనతో సైఫీ నర్సింగ్ ప్రైవేటు ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యింది. ఐతే వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా.. ఆమె కడుపులో టవల్‌ ఉంచేసి ఆపరేషన్‌ చేశారు డాక్టర్‌ మత్లూబ్‌.

కానీ ఆ తర్వాత మహిళకు కడుపు నొప్పి ఎక్కువ అవ్వడంతో తాళలేక సదరు డాక్టర్‌కి ఫిర్యాదు చేసింది. ఐతే బయట చలి ఎక్కువగా ఉండటం వల్లే అలా అనిపిస్తుందని చెప్పి మరో ఐదు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచేశారు సదరు మహిళని. కానీ ఆమెకు ఇంటికి వచ్చినా..ఆరోగ్యం మెరుగవ్వకపోవడంతో.. భర్త షంషేర్‌ అలీ ఆమెను అమ్రెహాలోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. అక్కడ అసలు విషయం తెలుసుకుని బాధితురాలి భర్త ఆలీ తెల్లబోయాడు. బాధితురాలి కడుపులో టవల్‌ ఉందని, ఆపరేషన్‌ చేసి తీసేసినట్లు అక్కడి ఆస్పత్రి వైద్యులు అలీకి తెలిపారు.

దీంతో అలీ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌(సీఎంఓ)కు సదరు ఆస్పత్రి నిర్వాకంపై ఫిర్యాదు చేశాడు. మీడియా కథనాల ద్వారా విషయం తెలుసుకున్న చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌(సీఎంఓ) రాజీవ్‌ సింఘాల్‌ ఈ విషయంపై సమగ్ర  విచారణ చేయమని నోడల్‌ అధికారి డాక్టర్‌ శరద్‌ను ఆదేశించారు. ఐతే అలీ ఈ విషయమై లిఖితపూర్వకంగా తనకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలిపారు. విచారణ నివేదిక రాగనే పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభిస్తారని సీఎంవో అధికారి సింఘాల్‌ చెప్పడం గమనార్హం. విచారణలో..వైద్యుడు మత్లూబ్‌ అమ్రోహాలో సైఫీ నర్సింగ్ హోమ్‌ని ఎలాంటి అనుమతి లేకుండా నడుపుతున్నట్లు తేలింది. 

(చదవండి: షాకింగ్ ఘటన: విమానంలో ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. టాటా చైర్మన్‌కు లేఖ)

మరిన్ని వార్తలు