India Omicron: భారత్‌లో ఒమిక్రాన్‌ బయటపడింది ఇలా..!

3 Dec, 2021 11:08 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా వేరియెంట్‌ ఒమిక్రాన్‌ భారత్‌లోకి వచ్చేసింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 66 ఏళ్ల వృద్ధుడు కరోనా నెగిటివ్‌ రిపోర్ట్‌తో నవంబర్‌ 20న బెంగళూరుకి చేరుకున్నారు. ఆయనలో లక్షణాలు కూడా కనిపించలేదు. అయినా విమానాశ్రయంలో ర్యాండమ్‌గా నిర్వహించిన  కోవిడ్‌–19 పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. దీంతో సెల్ఫ్‌ ఐసోలేషన్‌కి వెళ్లారు. వారం రోజుల తర్వాత ఒక ప్రైవేటు ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకున్న ఆయన కరోనా నెగెటివ్‌ రావడంతో దుబాయ్‌కి వెళ్లిపోయారు. ఆయన నుంచి సేకరించిన నమూనాలను ఇన్సాకాగ్‌ నెట్‌వర్క్‌కి పంపి జన్యుక్రమాన్ని విశ్లేషించగా అతనికి సోకింది ఒమిక్రాన్‌ వేరియెంట్‌ అని నిర్ధారణైంది.

చదవండి: (ఒమిక్రాన్‌ వచ్చేసింది.. వ్యాక్సిన్‌ వేసుకున్నప్పటికీ..)

ఆ వృద్ధుడిని నేరుగా కలుసుకున్న 24 మంది ప్రైమరీ కాంటాక్ట్‌లు, వారిని కలుసుకున్న మరో 240 మందికి (సెకండరీ కాంటాక్ట్‌) కరోనా పరీక్షలు నిర్వహిస్తే అందరికీ నెగెటివ్‌ వచ్చింది. ఇక ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకిన రెండో వ్యక్తి బెంగుళూరుకి చెందిన డాక్టర్‌. రెండు డోసులు పూర్తి అయిన ఆయన ఈ మధ్య కాలంలో ఇతర ప్రాంతాలకి కూడా ప్రయాణించలేదు. జ్వరం, ఒళ్లు నొప్పులు రావడంతో నవంబర్‌ 21న కరోనా పరీక్షలు చేయించుకోగా ఆయనకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆ మర్నాడే అతను ఆస్పత్రిలో చేరారు. మూడు రోజలు తర్వాత డిశ్చార్జ్‌ అయి వెళ్లిపోయారు.

చదవండి: (దడ పుట్టిస్తున్న ఒమిక్రాన్‌.. 9 రోజుల్లోనే 30 దేశాలకు..)

ఆయన నుంచి సేకరించిన శాంపిళ్లను అదే రోజు జన్యుక్రమాన్ని విశ్లేషించడానికి పంపగా ఒమిక్రాన్‌గా తేలింది. ఈ కేసులో ఆందోళన కలిగించే అంశమేమిటంటే డాక్టర్‌ను కలుసుకున్న వ్యక్తుల్లో ముగ్గురు ప్రైమరీ, ఇద్దరు సెకండరీ కాంటాక్ట్‌లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే వారికి సోకింది ఒమిక్రాన్‌ వేరియెంటా,  కాదా అన్నది ఇంకా జన్యు పరీక్షల్లో తేలాల్సి ఉంది. మొత్తంగా 13 మంది ప్రైమరీ, 205 మంది సెకండరీ కాంటాక్ట్స్‌కి పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్‌ వచ్చిన అయిదుగురిని ఐసొలేషన్‌లో ఉంచారు.  

మరిన్ని వార్తలు