Surgery to Cobra: నాగుపాముకి అరుదైన శస్త్రచికిత్స

12 Mar, 2022 10:18 IST|Sakshi

ఒడిశా (భువనేశ్వర్‌) : నాగుపాముకి అరుదైన శస్త్రచికిత్స చేసి, దాని పొట్టలో ఇరుక్కున్న సారా సీసా మూతను వైద్యులు తొలగించారు. ప్రస్తుతం వైద్యుల పరిశీలనలో ఉన్న పాము ఆరోగ్య పరిస్థితులను దాదాపు వారం రోజుల పాటు పరిశీలిస్తారు. నాలుగు రోజుల తర్వాత దానికి ద్రవ పదార్థాలను మాత్రమే ఆహారంగా ఇచ్చి, క్రమంగా కోలుకునేలా జాగ్రత్త వహిస్తారు. వివరాలిలా ఉన్నాయి.. స్థానిక వాసుదేవ్‌ నగర్‌లోని నిర్మాణ దశలో ఉన్న ఓ భవనం దగ్గరున్న కొట్టు గదిలో మూడున్నర అడుగుల నాగుపాముని అక్కడి కార్మికులు గుర్తించి, స్నేక్‌ హెల్ప్‌లైన్‌కు సమాచారమిచ్చారు. 

దీంతో అక్కడికి చేరుకున్న సిబ్బంది పామును చాకచక్యంగా పట్టుకుని, పరిశీలించగా, పాము పొట్ట భాగంలో ఏదో ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు ఒడిశా యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ టెక్నాలజీ మూగజీవాల చికిత్స విభాగానికి తరలించగా, అక్కడ తీసిన ఎక్స్‌–రేలో పాము పొట్టలో సీసా మూత ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం మూగజీవాల శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్‌ ఇంద్రమణి నాథ్, రేడియాలజీ నిపుణులు డాక్టర్‌ సిద్ధార్థ్‌ శంకర బెహరా ఆ పాముకు విజయవంతంగా శస్త్ర చికిత్స చేసి, సీసా మూతను తొలగించారు.

మరిన్ని వార్తలు