అక్కడ మరణించినా మొక్కరూపంలో బతుకుతారు!

22 Oct, 2021 09:57 IST|Sakshi

ఏపీ సెంట్రల్‌ డెస్క్‌: హిమాలయ పర్వత సానువుల్లో పచ్చ దనంతో విలసిల్లే ఓ చిన్న గ్రామం  ఉంది. 572 హెక్టార్లలో విస్తరించిన ఆ  గ్రామం పేరు కలిహంద్‌. జమ్ముకశ్మీర్‌లోని మారుమూల ప్రాంతమైన దోడా టౌన్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ గ్రామం. ఆ గ్రామం గురించి ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. అక్కడ చనిపోయినవారు మొక్కరూపంలో బతికే ఉంటారు. ఇదెలాగంటే.. అక్కడి వారు ఓ మంచి సంప్రదాయాన్ని పాటించడం వల్ల. ఆ గ్రామంలో ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన వారి కుటుంబ సభ్యులు గ్రామంలో పండ్లను ఇచ్చే ఓ మొక్కను నాటడమే ఆ మంచి సంప్రదాయం. 

ఆ మొక్క పెద్దది అయ్యే వరకు లేదంటే కాయలు కాసే వరకు దానిని సంరక్షించడం కూడా వారి బాధ్యతే. ఈ సంప్రదాయం గురించి గ్రామంలో ఎవరినడిగినా రెండు మాటలు చెబుతారు. ‘‘ఇదొక పుణ్య కార్యక్రమం’’ ‘‘శాస్త్రాల్లో ఉంది’’ అనేవి ఆ రెండు మాటలు. ఈ సంప్రదాయం తమ గ్రామంలో తరతరాల నుంచి కొనసాగుతోందని గ్రామస్తుడైన 75 ఏళ్ల నాథ్‌రామ్‌ చెప్పారు. గ్రామ జనాభాలో 75 శాతం ఉన్న హిందువులు ఈ సంప్రదాయం పాటిస్తారన్నారు. ఈ సంప్రదాయంతో ఆ గ్రామం ఓ చిన్న అడవిగా మారి పచ్చదనంతో విలసిల్లుతోంది.  

మరణాంతర జీవితంపై నమ్మకం
సనాతన సంప్రదాయంలో మరణాంతర జీవితంపై నమ్మకాన్ని గ్రామ పురోహితుడు పండిత్‌ దయారామ్‌ వివరిస్తూ.. గరుడ పురాణం దీని గురించి స్పష్టంగా చెప్పిందన్నారు. ఓ వ్యక్తి జీవితంలో చేసిన పనులు, మరణాంతరం ఆ వ్యక్తి సంబంధీకులు చేసిన పనులను బట్టి సదరు వ్యక్తి ఆత్మ స్వర్గానికి వెళ్తుందా లేక నరకానికా అనే నిర్ణయం అవుతుందన్నారు. మరణించిన వారి కుటుంబసభ్యులు నాటిన మొక్క అలసినవారు సేదతీరడానికి ఆశ్రయం ఇచ్చినా.. ఆ చెట్టు పండు ఒకరి ఆకలి తీర్చినా అది పుణ్యకార్యక్రమమే అవుతుందని, ఆ పుణ్య కార్యక్రమం మరణానంతరం మోక్షాన్ని కలగజేస్తుందని దయారామ్‌ వివరించారు. ఆర్థికంగా వెనుకబడినవారి ఇంట్లో ఎవరైనా మరణిస్తే గ్రామంలో మిగతావారంతా  ఆ కుటుంబానికి అండగా ఉంటామని మరో గ్రామస్తుడు బాబూరామ్‌ శర్మ చెప్పారు. అతను నాటిన యాపిల్, ఆప్రికాట్, పియర్‌ చెట్ల గురించి, వారి కుటుంబ సభ్యుల మరణాలను గురించి ఆయన వివరించారు.   

కాయలు ఎవరైనా కోసుకోవచ్చు.. 
చనిపోయిన వారి పేరిట మొక్కలను వారి సొంత స్థలంలోనో, ఒకవేళ స్థలం లేదంటే గ్రామానికి సంబంధించిన ఇతర స్థలంలోనో నాటవచ్చు. పెరట్లోనో, మరోచోటో నాటిన చెట్లను చూసినప్పుడల్లా చనిపోయిన వారి కుటుంబ సభ్యులు తరతరాల పాటు గుర్తుకువస్తారని గ్రామ సర్పంచ్‌ సునీల్‌ కుమార్‌ అన్నారు. చనిపోయిన వారి పేరిట నాటిన మొక్కలు పెద్దవై కాయలు కాస్తే కుటుంబ సభ్యులు వాటిని కోసుకుని తినరు. అవి ఇరుగుపొరుగుకి, ఇతర గ్రామస్తులకు ఉచితంగా పంచుతారు. ఆ చెట్టు నుంచి కుటుంబ సభ్యులు ఎలాంటి లాభాన్ని ఆశించరు. ఆ గ్రామం మీదుగా వెళ్లేవారు ఎవరైనా ఆ కాయలు కోసుకుని తినవచ్చు. దీనికి ఎవరి అభ్యంతరం ఉండదని సర్పంచ్‌ వివరించారు. కలిహంద్‌ గురించి తెలుసుకున్న పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఈ సంప్రదాయాన్ని పాటించడానికి మొగ్గు చూపుతున్నారు. ఇతరుల ఆకలి తీర్చడానికి ఉపయోగపడుతున్న ఈ మంచి సంప్రదాయం కొనసాగించడానికి మతాలకతీతంగా ముందుకొస్తున్నారు.   

మరిన్ని వార్తలు