కరోనాతో మరణిస్తే ఎల్ఐసీ పాలసీ క్లెయిమ్ చేసుకోవచ్చా?

11 May, 2021 15:19 IST|Sakshi

ముంబై: దేశంలో కరోనా మహమ్మారి విపరీతంగా వ్యాపిస్తున్న సమయంలో తమ వినియోగదారుల శ్రేయస్సు కోసం కట్టుబడి ఉన్నామని ప్రభుత్వ యాజమాన్యంలోని బీమా & పెట్టుబడి సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇటీవల పేర్కొంది. పాలసీదారులకు వారి మెచ్యూరిటీ క్లెయిమ్ పత్రాలను దేశవ్యాప్తంగా ఉన్న ఏదైనా ఎల్‌ఐసీ కార్యాలయంలో జమ చేయడానికి అనుమతించింది. అయితే చాలామంది కరోనాతో మరణిస్తే ఎల్ఐసీ పాలసీ వర్తిస్తుందా? లేదా? అన్న దానిపై చాలా అనుమానాలు ఉన్నాయి.

గతంలోనే దీనిపై లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివరణ ఇచ్చింది. ఇతర మరణాలతో పాటు కోవిడ్ 19తో చనిపోయినా ఎల్ఐసీ పాలసీ వర్తిస్తుంది అని ప్రకటించింది. అంటే మృతుల కుటుంబ సభ్యులలోని నామినీ ఎల్ఐసీ పాలసీ కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు అని గతంలోనే ఎల్ఐసీ స్పష్టం చేసింది. ఇలాంటి విపత్కర సమయంలో మీకు, మీ ప్రీయమైనవారికి అండగా నిలుస్తుందని పేర్కొంది. ఈ పాలసీ క్లెయిమ్ చేసుకునే విధానంలో కూడా ఎలాంటి మార్పు లేదు. సాధారణంగా పాలసీ ఎలా క్లెయిమ్ చేసుకుంటారో కోవిడ్ 19 కారణంగా మరణించిన వారి కుటుంబ సభ్యులు అదే పద్ధతిలో పాలసీ క్లెయిమ్ చేసుకోవచ్చు. 

గత ఏడాది కూడా, వైరస్ వ్యాప్తి కారణంగా ఎల్ఐసీ పెద్ద సంఖ్యలో డెత్ క్లెయిమ్స్ ను విజయవంతంగా పరిష్కరించింది. కరోనా వైరస్ కారణంగా ఎవరైనా మరణిస్తే, ఎల్‌ఐసీ పాలసీలో మరణించిన వ్యక్తి పేర్కొన్న నామినీ డెత్ క్లెయిమ్ సమాచారం, మరణ ధృవీకరణ పత్రం, పాలసీ షెడ్యూల్ కాపీని మీ సమీప బ్రాంచ్ కార్యాలయంలో సమర్పించాలి. కరోనా కారణంగా మీ దగ్గరలోని సమీప శాఖ పనిచేయకపోతే నామినీలు డెత్ క్లెయిమ్ ఇంటిమేషన్, మరణ ధృవీకరణ పత్రం, పాలసీ షెడ్యూల్ యొక్క కాపీని ఎల్‌ఐసీ నోడల్ వ్యక్తికి ఈ-మెయిల్ చేయవచ్చు. 

అలాగే, మీ ఎల్ఐసీ ఏజెంట్‌ని సంప్రదించొచ్చు. ఎల్ఐసీ ఏజెంట్ డెత్ క్లెయిమ్ సెటిల్మెంట్‌ విషయంలో మీకు సహకరిస్తారు. "కరోనా వైరస్ మహమ్మారి నిబందనల ప్రకారం ఎల్ఐసీ బ్రాంచ్‌లు, ప్రీమియం పాయింట్స్, కాల్ సెంటర్లు పాక్షికంగా సేవలు అందిస్తాయి. ఆన్‌లైన్ సేవలు మాత్రం 24 గంటలు అందుబాటులో ఉన్నాయి. దయచేసి ఇంట్లోనే సురక్షితంగా ఉండండి" అని ఎల్ఐసీ ఒక ప్రకటనలో తెలిపింది.

చదవండి:

కోవిడ్ బాధితుల కోసం స్నాప్‌డీల్‌ సంజీవని యాప్ 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు