అమ్మ మాట కోసం.. కోటి విలువ చేసే ఆస్తుల విరాళం

19 Dec, 2020 12:36 IST|Sakshi
దాత కుమార్తెలతో, కుటుంబ సభ్యులు

తల్లి ఆఖరి కోర్కెను తీర్చిన కుమార్తెలు

సాక్షి, జయపురం: తమ తల్లి చివరి కోరికను తీర్చి, పలువురికి ఆదర్శంగా నిలిచారు ముగ్గురు మహిళలు. సుమారు రూ.కోటి విలువైన ఆస్తులను జగన్నాథ మందిరానికి విరాళంగా ఇచ్చి, దాతృత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నవరంగపూర్‌ పట్టణం భగవతీ వీధికి చెందిన భవానీసాహు భార్య వైజయంతీమాల సాహు జగన్నాథుని భక్తురాలు. ఇదే నెల 2న అనారోగ్యంతో ఆమె కన్నుమూసింది. మృతికి ముందే జగన్నాథునిపై తన విశ్వాసాన్ని చాటుకుంటూ ఆస్తిని నవరంగపూర్‌ లోని జగన్నాథ మందిరానికి అప్పగించాలని కోరింది. విషయాన్ని తన ముగ్గురు కుమార్తెలు పుష్పాంజళి సాహు, గీతాంజళి శతపతి, శ్రద్ధాంజళీ పండలకు తెలియజేసింది. చదవండి: (పెళ్లింట్లో భారీ చోరీ.. 200 తులాల బంగారం మాయం)


జగన్నాథుని మందిరానికి దానం చేసిన భవనం

ఈ నేపథ్యంలో తమ తల్లి పేరున ఉన్న నవరంగపూర్‌ భగవతీ వీధిలోని 25 గదులతో గల మూడంతుస్తుల భవనాన్ని నవరంగపూర్‌ జగన్నాథ మందిరానికి విరాళంగా అందజేశారు. అలాగే ఆమె బంగారు, వెండి ఆభరణాలను నవరంగపూర్‌ నీలకంఠేశ్వర ఆలయంలోని పార్వతీదేవి మందిరానికి దానం చేశారు. వైజయంతిమాల మరణానికి ముందు తన ఇష్టాన్ని తెలియజేసిందని, ఆమె కోర్కెను తీర్చేందుకు గర్విస్తున్నామని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆమెకు మగ సంతానం లేకపోవడంతో జగన్నాథుడే తన కుమారుడని ఆమె భావించేదట. ఇదే కారణంతో తన పేరుతో ఉన్న ఆస్తిని జగన్నాథునికి అర్పించాలన్న మాటను వైజయంతిమాల మరణించిన 14వ రోజు కుమర్తెలు మందిరానికి సమర్పించారు. విరాళంగా అందజేసిన భవనంలో ప్రస్తుతం 9 కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. ఆ అద్దెలు జగన్నాథ మందిర నిర్వహణకు కేటాయించనున్నారు. చదవండి:  (చెట్టంత కొడుకులు.. శవాలై తేలితే..)

మరిన్ని వార్తలు