వ్యవసాయ బిల్లుల కాపీలను చింపివేసిన కేజ్రివాల్‌

17 Dec, 2020 18:50 IST|Sakshi

న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ గురువారం అసెంబ్లీలో వ్యవసాయ బిల్లుల కాపీలను చింపివేశారు. కరోనా కాలంలో అంత అత్రుతగా చట్టాలను ఆమోదించుకోవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. వ్యవసాయ బిల్లులపై కేంద్రం మరోమారు పునరాలోంచుకోవాలని, బ్రిటీషర్స్‌ కంటే అధ్వానంగా తయారుకావొద్దంటూ కేంద్రానికి  విజ్ఞప్తి చేశారు. 'వ్యవసాయ బిల్లుల ప్రయోజనాలను  రైతులకు వివరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్రం చెబుతోంది. రైతుల భూములు తీసుకోనందున అది వారికి లాభం చేకూరుతుందని యూపీ సీఎం యోగి అంటున్నారు. అసలు ఇవి రైతులకు ప్రయోజనకరమా?ఢిల్లీ సరిహద్దుల్లో గత మూడు వారాలుగా రైతులు తమ నిరసన తెలియజేస్తున్నారు. లాఠీ చార్జీలు చేసినా , టియర్‌ గ్యాస్‌ ప్రయోగించినా లెక్కచేయకుండా ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గకుండా ప్రతీ రైతు ఓ భగత్‌సింగ్‌లా మారారు. ఈ క్రమంలో రైతు నిరసనలకు మద్దతుగా ఆప్‌ వారికి బాసటగా నిలుస్తోంది. వారికి తాగునీరు, వైద్యం, పారిశుధ్యం, వంటి మౌలిక సదుపాయాలను అందిస్తోందని,  రైతుల డిమాండ్లకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం' అని కేజ్రివాల్‌ పేర్కొన్నారు. (కేంద్రంపై మండిపడ్డ మమతా బెనర్జీ )
 

రైతులు చేస్తున్న ఆందోళనలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా 65ఏళ్ల పూజారి సహా 20మంది మరణించినట్లు కేంద్రానికి నివేందించారు. రైతులు తమ గొంతులను వినిపించడానికి ఎంకెంత మంది ప్రాణత్యాగం చేయాలని ప్రశ్నించారు. రైతులకు మద్దతుగా ఆప్‌ ఎమ్మెల్యేలు మహేంద్ర గోయల్‌, సోమనాథ్‌ భారతి సైతం వ్యవసాయ బిల్లుల కాపీలను చింపివేశారు. ఈ నల్లచట్టాలను తాము వ్యతిరేకిస్తున్నామని వారు వ్యాఖ్యానించారు. మరోవైపు, ఇతర రైతు సంఘాలతో సమాంతర చర్చలను నిలిపేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనల్లో పాల్గొంటున్న 40 రైతు సంఘాల ఐక్య కూటమి ‘సంయుక్త కిసాన్‌ మోర్చా’ కేంద్రానికి లేఖ రాసింది. యూపీ సహా పలు రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాలతో ఇటీవల కేంద్ర  ప్రతినిధులు భేటీకావడం తెల్సిందే. వ్యవసాయ చట్టాలకు సవరణలు చేస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామని కేంద్రానికి రాసిన లేఖలో స్పష్టం చేశారు. మరోవైపు, చిల్లా సరిహద్దు వద్ద భద్రతను మరింత పెంచారు. చిల్లా సరిహద్దును  దిగ్బంధిస్తామని రైతు నేతలు హెచ్చరించిన నేపథ్యంలో ఢిల్లీ–నోయిడా మార్గంలోని చిల్లా సరిహద్దులో  బలగాలను మోహరించారు. (రైతులకు మద్దతుగా ఆత్మహత్య )
 

మరిన్ని వార్తలు