శిండే, ఠాక్రే వివాదంలో జోక్యం వద్దు..రాజ్‌ ఠాక్రే ఆదేశం

11 Oct, 2022 14:30 IST|Sakshi

సాక్షి, ముంబై: ఉద్ధవ్‌ ఠాక్రే, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండే మధ్య జరుగుతున్న రాజకీయ వివాదంలో జోక్యం చేసుకోవద్దని మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన (ఎమ్మెన్నెస్‌) చీఫ్‌ రాజ్‌ ఠాక్రే  పార్టీ పదాధికారులకు, శ్రేణులకు ట్విట్టర్‌ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో స్ధానికంగా జరిగే సభలు, సమావేశాల్లో ఎలాంటి వివాదాస్పద ప్రసంగాలు చేయవద్దని, సోషల్‌ మీడియాలో కూడా కామెంట్లు చేసిన క్లిప్పింగులు, రాతలుగానీ పెట్టవద్దని సూచించారు. ఇరువురు మధ్య నెలకొన్న వివాదం సద్దుమణిగాక సమయం చూసుకుని తానే స్వయంగా అభిప్రాయాలను వెల్లడిస్తానని పదాధికారులకు, కార్యకర్తలకు సూచించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు వాడీవేడిగా ఉన్నాయి. శివసేన ఎవరిదనే విషయం తాజాగా ఉండగానే కొత్త వివాదం తెరమీదకు వచ్చింది. తదుపరి ఆదేశాలు జారీ అయ్యేంత వరకు శివసేన పేరు, విల్లు–బాణం గుర్తును వినియోగించడంపై ఎన్నికల సంఘం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో శివసేన తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. ఫలితంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇలాంటి సమయంలో మీరు జోక్యం చేసుకుంటే పరిస్ధితి మరో విధంగా మారుతుందని రాజ్‌ అన్నారు.

గతంలో ఎమ్మెన్నెస్‌ నేత సందీప్‌ దేశ్‌పాండే సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసిన వ్యాఖ్యలు, సందేశాలు దుమారం లేపాయి. దీంతో ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం, ఎమ్మెన్నెస్‌ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇది కొద్దిరోజుల వరకు సాగింది. గత అనుభవం, తాజా పరిస్ధితులను దృష్టిలో ఉంచుకుని ఈ వివాదంలో ఎవరూ మాట్లాడవద్దని, రాయవద్దని రాజ్‌ హెచ్చరించారు.  

మరిన్ని వార్తలు