ఇంటింటికీ టీకాలు సాధ్యం కాదు!

22 Apr, 2021 05:39 IST|Sakshi

బాంబే హైకోర్టులో కేంద్రం అఫిడవిట్‌  

సాక్షి, న్యూఢిల్లీ: ఇంటింటికీ వెళ్లి టీకాలు వేయడం సాధ్యం కాదని కేంద్రం పేర్కొంది. ఇంటింటికీ (డోర్‌–టు–డోర్‌) టీకాలు వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ బాంబే హైకోర్టులో దాఖలైన పిటిషన్‌కు కౌంటరు దాఖలు చేస్తూ... ఆ విధంగా చేయలేకపోవడానికి ఐదు కారణాలున్నాయంటూ కేంద్రం అఫిడవిట్‌ దాఖలు చేసింది. కరోనా వ్యాక్సినేషన్‌ నిమిత్తం జాతీయ నిపుణుల బృందం దేశంలో టీకా డ్రైవ్‌ అంశాలకు మార్గనిర్దేశం చేస్తోందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అఫిడవిట్‌లో పేర్కొంది.

1. టీకా వేశాక ప్రతికూల సంఘటనలు ఎదురైతే తక్షణ వైద్య సదుపాయాలు అందించడంలో ఆలస్యం కావొచ్చు.
2. వ్యాక్సినేషన్‌ తర్వాత తీసుకున్న వ్యక్తికి 30 నిమిషాలు పరిశీలించడంలో అందరికీ సాధ్యం కాకపోవచ్చు.
3. పదేపదే వ్యాక్సిన్‌ భద్రత పరిచే పెట్టెను తెరవడం, ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల వ్యాక్సిన్‌ పాడయ్యే అవకాశం ఉంది. తద్వారా వ్యాక్సిన్‌ సామర్థ్యం తగ్గడం తోపాటు దుష్పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాం. వ్యాక్సిన్‌పై నమ్మకం కూడా తగ్గే అవకాశం ఉంది.
4. ఒక లబ్ధి దారుడు నుంచి మరో లబ్ధిదారుడిని చేరుకొనే క్రమంలో వ్యాక్సిన్‌ వృథా అయ్యే అవకాశం ఉంది.
5. డోర్‌ టు డోర్‌ వల్ల కరోనా ప్రొటోకాల్స్‌ పాటించే అవకాశం ఉండదు. 

మరిన్ని వార్తలు