అలనాటి దూరదర్శన్‌ యాంకర్‌ గీతాంజలి అయ్యర్‌ కన్నుమూత

7 Jun, 2023 21:35 IST|Sakshi

గీతాంజలి అయ్యర్‌(70).. దేశంలోని మొట్టమొదటి మహిళా న్యూస్ ప్రెజెంటర్. సుమారు 30 ఏళ్ల పాటు దూరదర్శన్‌లో న్యూస్‌ రీడర్‌ పని చేసిన ఆమె ఇక లేరు. బుధవారం వాకింగ్ చేసి ఇంటికొచ్చిన ఆమె కుప్పకూలి ప్రాణాలు విడిచారు.  ఆమె మృతిని కుటుంబ సభ్యులు ప్రకటించారు.గత కొంతకాలంగా పార్కిన్‌సన్స్‌తో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 

1971లో దూరదర్శన్‌లో న్యూస్‌ ప్రజెంటర్‌గా చేరిన ఆమె.. ఆంగ్లంలో వార్తలు చదివిన తొలి ప్రజెంటర్‌ కూడా. నేషనల్‌ బులిటెన్‌తో దేశవ్యాప్తంగా ఆమె మంచి గుర్తింపు దక్కించుకున్నారు.  అంతేకాదు.. నాలుగు సార్లు ఉత్తమ యాంకర్‌ అవార్డు అందుకున్నారు. 

మీడియా రంగంలో సేవలకుగానూ గీతాంజలి..  1989లో అవుట్‌స్టాండింగ్‌ విమెన్‌ అవార్డుగా ఇందిరా గాంధీ ప్రియదర్శిని అవార్డు అందుకున్నారు.వరల్డ్ వైడ్ వైల్డ్‌లైఫ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్)తో కలిసి పనిచేశారు.  గీతాంజలి మృతి విషయం తెలిసిన పలువురు జర్నలిస్టులు, రాజకీయ నాయకులు నివాళులు అర్పిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సైతం ట్విటర్‌ ద్వారా సంతాపం తెలిపారు.  

గీతాంజలి అయ్యర్‌.. కోల్‌కతా లోరెటో కాలేజీలో ఆంగ్లంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారామె. నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా డిప్లోమా సైతం పూర్తి చేశారు. దూరదర్శన్‌ కెరీర్‌ ముగిశాక.. కార్పొరేట్‌ రంగం వైపు అడుగులు వేశారు. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీలో పని చేసిన ఆమె.. ఖాందాన్‌ అనే సీరియల్‌లోనూ చివరిసారిగా నటించారు. గీతాంజలికి ఇద్దరు పిల్లలు. కూతురు పల్లవి కూడా అవార్డ్‌ విన్నింగ్‌ జర్నలిస్ట్‌ కూడా. 
 

మరిన్ని వార్తలు