డీపీఐఐటీ కార్యదర్శి.. గురుప్రసాద్‌ కన్నుమూత

20 Jun, 2021 03:18 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర పరిశ్రమలు, ఇంటర్నల్‌ ట్రేడ్‌ విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి గురుప్రసాద్‌ మొహపాత్ర (59) కన్నుమూశారు. కరోనా సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం మరణించారని ఎయిమ్స్‌ ప్రకటించింది. అనారోగ్య కారణాలతో ఏప్రిల్‌ మధ్యలో ఆయన ఆస్పత్రిలో చేరారు. పదవిలో ఉండగా కరోనా కారణంగా మరణించిన మొదటి కార్యదర్శి ఆయనే కావడం గమనార్హం. ఆయన మరణం పట్ల ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం తనకెంతో బాధను కలిగించిందని పేర్కొన్నారు.

గుజరాత్‌లోనూ, కేంద్రంలోనూ ఆయనతో కలసి పని చేసినట్లు వెల్లడించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. గురుప్రసాద్‌ ఎంతో నిర్మాణాత్మకంగా పని చేసేవారని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. వీరితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ మంత్రి పియూష్‌ గోయల్, పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేబినెట్‌ కార్యదర్శి రాజివ్‌ గౌబా కూడా ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. గుజరాత్‌ కేడర్‌కు చెందిన గురుప్రసాద్‌ 1986 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి.   

చదవండి: (ఫోన్‌ మాట్లాడుతూ.. రెండు డోసులు?)  

మరిన్ని వార్తలు