జాగ్రత్తగా ఉంటే మూడో వేవ్‌ రాకపోవచ్చు..

2 Jul, 2021 08:16 IST|Sakshi

పెద్ద సంఖ్యలో వ్యాక్సినేషన్ జరిగినప్పుడు సాధ్యం

వ్యాక్సిన్‌ డోస్‌ మిక్సింగ్‌పై ఇంకా పరిశోధన: రణదీప్‌ గులేరియా 

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మూడో వేవ్‌ వస్తుందని జరుగుతున్న పెద్ద ఎత్తున ఊహాగానాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండి, కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా తెలిపారు. వీటితో పాటు దేశంలో ఎక్కువమంది ప్రజలకు వ్యాక్సినేషన్‌ జరిగినప్పుడు మూడో వేవ్‌ కరోనా మహమ్మారి ఉండకపోవచ్చనన్నారు. గురువారం ఢిల్లీలో ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా విషయంలో ప్రజలు ఏమేరకు జాగ్రత్తగా ఉంటారన్న విషయంపైనే మూడో వేవ్‌ సంక్రమణ ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. ఒకవేళ వచ్చినా అది బలహీనంగా ఉండవచ్చని గులేరియా అభిప్రాయపడ్డారు.

అంతేగాక వ్యాక్సిన్‌ డోస్‌ మిక్సింగ్‌పై ఒక నిర్ణయానికి వచ్చేందుకు మరింత డేటా అవసరమని తెలిపారు. ఈ విషయంలో ఇప్పటికే అనేక అధ్యయనాలు జరిగాయని అన్నారు. అయితే ఇది ప్రభావవంతంగా ఉంటుందని చెబుతున్నప్పటికీ, సాధారణం కంటే ఎక్కువ దుష్ప్రభావాలు ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ డోస్‌ మిక్సింగ్‌ అనేది ప్రయత్నించవలసిన విధానం అని చెప్పడానికి తమకు మరింత డేటా అవసరమని, ఇంకా పరిశోధనలు జరగాలని డాక్టర్‌ గులేరియా వెల్లడించారు. దేశంలో కరోనా యాక్టివ్‌ కేసులపై ఆయన.. కరోనా పాజిటివిటీ ఎక్కువగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో వైరస్‌ సంక్రమణ మరింత ఎక్కువ కాకుండా ఉండేందుకు మరింత దూకుడు విధానాన్ని అవలంభించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
 

చదవండి: వైద్యులకు సెల్యూట్: ప్రధాని మోదీ

మరిన్ని వార్తలు