మరో 9 నగరాల్లో స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌.. జాబితాలో విశాఖ, మిర్యాలగూడ

17 Jun, 2021 15:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:   కరోనా  మహమ్మారి చికిత్సలో డీఆర్‌డీవో రూపొందించిన  కీలక డ్రగ్‌ను ఇటీవల విడుదల చేసిన దేశీయ ఫార్మా  దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ మరో శుభవార్త అందించింది. స్పుత్నిక్‌-వీ టీకాలు ఇక నుంచి మ‌రో 9 న‌గ‌రాల్లో అంద‌బాటులోకి వ‌స్తాయ‌ని డాక్ట‌ర్ రెడ్డీస్ సంస్థ గురువారం ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ఈ జాబితాలో ఢిల్లీ, బెంగళూరు, ముంబై, కోల్‌కతా, చెన్నై, విశాఖపట్నం, బ‌డ్డీ, కోల్హాపూర్‌, మిర్యాలగూడ నగరాలు ఉన్నట్లు వెల్లడించింది. ప్ర‌స్తుతం పైల‌ట్ ప‌ద్ధ‌తిలో టీకాల‌ను అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే.

ర‌ష్యాకు చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను .. మ‌న దేశంలో డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. కాగా, ఈ టీకాను మొదట హైదరాబాద్‌లో విడుదల చేశారు. అయితే ప్ర‌స్తుతం స్పుత్నిక్‌-వీ టీకాల‌ను కోవిన్ పోర్ట‌ల్ ద్వారా బుక్ చేసుకునే సౌక‌ర్యం లేదు. పైల‌ట్ లాంచింగ్ ప్ర‌క్రియ తుది ద‌శ‌లో ఉన్న‌ద‌ని, రెండు డోసుల టీకాల‌ను అందుబాటులోకి తీసుకువచ్చే ప్ర‌య‌త్నం జ‌రుగుతున్నట్లు రెడ్డీస్ ల్యాబ్ తెలిపింది. కాగా, మైన‌స్ 18డిగ్రీల సెంటిగ్రేడ్ వ‌ద్ద స్పుత్నిక్ వీ టీకాల‌ను నిల్వ చేస్తారు.

చదవండి: భారత ట్విటర్‌ ఎండీని ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు

మరిన్ని వార్తలు