Anti Ship Missile India: నౌక విధ్వంసక క్షిపణి తొలి పరీక్ష సక్సెస్‌

19 May, 2022 08:14 IST|Sakshi

బాలాసోర్‌(ఒడిశా): శత్రు దేశ యుద్ధనౌకలను తుత్తునియలు చేసే అధునాతన క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) బుధవారం ప్రకటించింది. ఒడిశాలోని చాందీపూర్‌ సమీపంలో సముద్రతీర ప్రాంతంలో భారత నావికా దళం, డీఆర్‌డీవో సంయుక్తంగా ఈ పరీక్ష నిర్వహించడం ఇదే తొలిసారికావడం గమనార్హం.

నావికాదళ హెలికాప్టర్‌ ద్వారా ప్రయోగించిన ఈ కొత్త యాంటీ–షిప్‌ మిస్సైల్‌ అత్యంత ఖచ్చితత్వంతో నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించిందని డీఆర్‌డీవో వర్గాలు వెల్లడించాయి. హెలికాప్టర్‌ అవసరాల కోసం దేశీయంగా తయారుచేసిన లాంచర్‌ను ఈ క్షిపణిలో వినియోగించారు. క్షిపణిని విజయవంతంగా పరీక్షించినందుకు సంబంధిత శాస్త్రవేత్తలను డీఆర్‌డీవో చైర్మన్‌ జి.సతీష్‌ రెడ్డి అభినందించారు. 

మరిన్ని వార్తలు