పరిశోధనలను ముమ్మరం చేయాలి

31 Aug, 2021 06:29 IST|Sakshi
దివ్యాంగ శాస్త్రవేత్తకు వడ్డిస్తున్న వెంకయ్య

డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలకు ఉపరాష్ట్రపతి సూచన

సాక్షి, న్యూఢిల్లీ: భవిష్యత్తులో ఎదురు కాబోయే మహమ్మారులను సమర్థవంతంగా ఎదుర్కొనే దిశగా పరిశోధనలను మరింత ముమ్మరం చేయాలని డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. కోవిడ్‌ –19 మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో డీఆర్‌డీఓకు చెందిన డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజియాలజీ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌ (డి.ఐ.పి.ఏ.ఎస్‌) శాస్త్రవేత్తల సహకారం అభినందనీయమని ఆయన తెలిపారు. సోమవారం డి.ఐ.పి.ఏ.ఎస్‌.కు చెందిన దాదాపు 25 మంది శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులను ఉపరాష్ట్రపతి తమ నివాసానికి ఆహ్వానించారు. వారిలో డీఆర్‌డీఓ చైర్మన్‌ డాక్టర్‌ జి.సతీష్‌ రెడ్డి కూడా ఉన్నారు.

కోవిడ్‌ –19 చికిత్స, నిర్వహణ కోసం వివిధ స్వదేశీ ఉత్పత్తులను అభివృద్ధి చేసిన డి.ఐ.పి.ఏ.ఎస్‌., ఇతర డీఆర్‌డీఓ ల్యాబ్‌లను వెంకయ్య అభినందించారు. అంతేగాక ఎ లాంటి ప్రతికూల పరిస్థితులనైనా సమర్థవం తంగా ఎదుర్కొనేందుకు శాస్త్రీయ సమాజం సిద్ధంగా, అప్రమత్తంగా ఉండాలని ఉపరాష్ట్రపతి సూచించారు. కార్యక్రమం ప్రారంభంలో కోవిడ్‌ –19 చికిత్స, నిర్వహణ కోసం డీఆర్‌డీఓ ల్యాబ్స్‌ ద్వారా దేశీయంగా అభివృద్ధి చెందిన వివిధ ఉత్పత్తులు, పరికరాల గురించి డాక్టర్‌ జి. సతీష్‌ రెడ్డి ఉపరాష్ట్రపతికి వివరించారు. శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులను ఆహ్వానించి తమ అభిప్రాయాలు, ఆలోచనలను వారితో పంచుకున్నందుకు ఉపరాష్ట్రపతికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  
 

మరిన్ని వార్తలు