రూ.31.67 కోట్ల అంబర్‌గ్రిస్‌ స్వాధీనం

22 May, 2023 06:24 IST|Sakshi

న్యూఢిల్లీ: డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) అధికారులు తమిళనాడులోని ట్యుటికోరన్‌లో అత్యంత ఖరీదైన అంబర్‌గ్రిస్‌(తిమింగలం వాంతి)ని పట్టుకున్నారు. ట్యుటికోరన్‌లోని హార్బర్‌ బీచ్‌ ఏరియా నుంచి శ్రీలంకకు ఓ ముఠా అంబర్‌గ్రీస్‌ను తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు అధికారులు సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఓ వాహనంలో తరలిస్తున్న 18.1కిలోల బరువైన అంబర్‌ గ్రిస్‌ సంచీ దొరికింది.

ఇందుకు సంబంధించి తమిళనాడు, కేరళలకు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనమైన అంబర్‌గ్రిస్‌ విలువ రూ.31.67 కోట్లని అంచనా.  సుగంధ ద్రవ్యాల తయారీలో వాడే అంబర్‌గ్రిస్‌కు అంతర్జాతీయ మార్కెట్‌లో ఎక్కువ గిరాకీ ఉంది. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం స్పెర్మ్‌ వేల్‌ ఉత్పత్తుల ఎగుమతి, రవాణాలపై నిషేధం ఉంది. గత రెండేళ్లలో ట్యుటికోరన్‌ తీరంలో స్మగ్లర్ల నుంచి రూ.54 కోట్ల విలువైన 40.52 కిలోల అంబర్‌గ్రిస్‌ను పట్టుకున్నట్లు డీఆర్‌ఐ తెలిపింది.

మరిన్ని వార్తలు