అన్వేషణలో డ్రోన్లు, భారీ యంత్రాలు

11 Feb, 2021 06:24 IST|Sakshi
తపోవన్‌ టన్నెల్‌లో గాలింపు చర్యలు

ఉత్తరాఖండ్‌ తపోవన్‌

సొరంగంలో 35 మంది కార్మికులు

కాపాడడానికి శ్రమిస్తున్న సహాయ బృందాలు  

డెహ్రాడూన్‌: హిమానీనదం వరదలతో అతలాకుతలమైన ఉత్తరాఖండ్‌లో ఇంకా 174 మంది ఆచూకీ లభించడం లేదు. ఎన్‌టీపీసీ హైడల్‌ ప్రాజెక్టు తపోవన్‌ సొరంగ ముఖద్వారం మట్టి, రాళ్ల పెళ్లలతో మూసుకుపోవడంతో సహాయ చర్యలు అత్యంత సంక్లిష్టంగా మారాయి. భారీ యంత్రాల సాయంతో వాటిని తొలగించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో సొరంగంలో చిక్కుకుపోయిన 25–35 మంది కార్మికుల్ని కాపాడడానికి డ్రోన్లను, ఇతర ఆధునిక సాంకేతిక పరికరాలను మోహరించి గాలిస్తున్నారు. ‘‘సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం. లోపలికి వెళ్లడానికి భారీగా పేరుకుపోయిన రాళ్లతో కూడిన బురద అడ్డంగా ఉంది. దానిని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి’’అని ఉత్తరాఖండ్‌ డీఐజీ నీలేశ్‌ ఆనంద్‌ భార్నె చెప్పారు. సొరంగ మార్గంలో శిథిలాలతో కూడిన బురద ఎండిపోవడంతో గట్టిపడి లోపలికి వెళ్లడానికి వీల్లేకుండా ఉంది. ఇప్పటివరకు 80 మీటర్ల లోపలికి తవ్వకాలు జరిపారు. 100 మీటర్ల వరకు వెళితే లోపల చిక్కుకున్న వారీ ఆచూకీ తెలియవచ్చు’’అని వెల్లడించారు.  

అలుపెరుగని సాయం..
కేవలం సొరంగ మార్గం వద్ద సహాయ చర్యల కోసం ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీసు, నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్, స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్, సహస్త్ర సీమ బల్‌ (ఎస్‌ఎస్‌బీ) సిబ్బంది 600 మందికి పైగా నిరంతరాయంగా సహాయ కార్యక్రమాలు అందిస్తున్నారు. పెద్ద పెద్ద మంచుపెళ్లల్ని పెకిలించడం, నీటిని భారీ యంత్రాలతో తోడుతున్నప్పటికీ ఇంకా బాగా వస్తూనే ఉంది’’అని ఉత్తరాఖండ్‌ డీజీపీ అశోక్‌ కుమార్‌ చెప్పారు. లోపల చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తామన్నారు. అయితే సొరంగానికి అడ్డంగా ఉన్న శిథిలాల తొలగింపు ఆలస్యమవుతున్న కొద్దీ లోపలున్న వారి పరిస్థితి ఎలాగ ఉందోనన్న ఆందోళన పెరుగుతోంది. ‘‘కాలం గడుస్తున్న కొద్దీ ఆ కార్మికులు సజీవంగా ఉంటారన్న నమ్మకం పోతోంది. అయితే ఏదైనా అద్భుతం జరిగితే వారిని కాపాడుకోవచ్చు’’అని రాష్ట్ర సహాయ బృందం సభ్యుడు పీయూష్‌ అన్నారు. ‘రేయింబగళ్లు శిథిలాలను తొలగిస్తున్నా పని పూర్తి అవడం లేదు. సొరంగం వెలుపల ఆక్సిజన్‌ సిలండర్లు, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారు’ అని ఐటీబీపీ అధికార ప్రతినిధి వివేక్‌ పాండే అన్నారు.   

మరిన్ని వార్తలు